సీమాంధ్ర ఉద్యమం వెనుక సీఎం
హైకమాండ్‌కు టీ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5 (జనంసాక్షి) :
సీమాంధ్ర ప్రాంతంలో జరుగు తున్న ఉద్యమం వెనుక ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉ న్నారని తెలంగాణ ప్రాంత నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆందోళనలను ప్రోత్సహిస్తున్నారని, సమైక్యాంధ్ర ఉద్యమాన్ని వెనుకుండి నడిపిస్తున్నారని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాల్సిన సీఎం ఒక ప్రాంతానికి ప్రతినిధిగా, మరో ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆయన్ను పదవి నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి జానారెడ్డి, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ గురువారం ఢిల్లీలో దిగ్విజయ్‌ను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, సీమాంధ్రలో ఉద్యమం, తదితర అంశాలపై వారు దిగ్విజయ్‌తో చర్చించారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై దిగ్విజయ్ దృష్టికి తీసుకొచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా కిరణ్ వ్యవహరిస్తున్నారని, నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్నే ప్రశ్నించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర ఉద్యమం వెనుక ఉన్నది సీఎం కిరణేనని వివరించారు. విభజన ప్రకటన తర్వాత సీమాంధ్రలో పెద్దగా ఉద్యమం రాలేదని, కానీ సీఎం ప్రోత్సాహంతోనే ఆ తర్వాత ఉదృతమైందని తెలిపారు. కిరణ్‌ను కలిసిన తర్వాతే ఏపీఎన్జీవోలు ఆందోళనలను ఉద్ధృతం చేశారని, సమ్మె బాట పట్టారన్నారు. వెనుకుండి ఉద్యోగులను, ప్రజలను రెచ్చగొడుతున్నారని చెప్పారు. తెలంగాణ సభలకు, సమావేశాలకు ఎప్పుడూ అనుమతి అడిగినా ఇవ్వలేదని, కానీ, సీమాంధ్ర ఉద్యోగులు ఈ నెల 7న బహిరంగ సభ నిర్వహించుకొనేందుకు అడగ్గానే అనుమతి ఇచ్చారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం పట్ల పక్షపాతం వహిస్తూ, శాంతియుతంగా ఉన్న తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా సీఎం ప్రవర్తన ఉందని దిగ్విజయ్ దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్‌లో శాంతిర్యాలీ నిర్వహించేందుకు టీఎన్జీవోలు అడిగితే అనుమతి ఇవ్వకుండా సీమాంధ్ర ఉద్యోగుల సభకు అనుమతి ఇవ్వడం ప్రజలను రెచ్చగొట్టడమేనన్నారు. సీఎంను అదుపులో ఉంచాలని, తక్షణమే ఏపీ ఎన్జీవోల సభకు అనుమతి రద్దు చేయాలని ఆదేశించాలని కోరారు. సీమాంధ్రలో ఉద్యమాన్ని చల్లార్చాలంటే ముఖ్యమంత్రిని దించేయాలని విన్నవించారు. రాష్ట్ర విభజన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, ఆలస్యం చేస్తే పరిస్థితి చేయిదాటిపోతుందని హెచ్చరించారు.
సంయమనం పాటించాలి : జానా
ప్రజలంతా సంయమనం పాటించాలని మంత్రి జానారెడ్డి కోరారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను దిగ్విజయ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. భేటీ ముగిసిన అనంతరం జానా విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తూ ఎవరూ ఒప్పుకోరని, సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం తెలంగాణ ఏర్పాటు చేయాలని దిగ్విజయ్‌ను కోరామన్నారు. ఈ నెల 7న జరిగే ఏపీ ఎన్జీవోల సభ పట్ల తెలంగాణ వాదులు సంయమనంతో వ్యవహరించాలని కోరారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తూ ఎవరూ ఒప్పుకోరని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీడబ్ల్యూసీ తీర్మానం ప్రకారమే హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనలో సమన్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. హైకమాండ్ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.