సీఎం తీరును వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల దీక్ష
అనుమతించిన స్పీకర్
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (జనంసాక్షి) :
సొంత గడ్డ మీద తమ హక్కులకే రక్షణ లేకుండా పోయిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశా రు. సొంత గడ్డపై నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. వారికి రాచమర్యాదలు.. మాకు అవమానాలా? అంటూ మండిపడ్డారు. హైదరాబాద్ వీధుల్లో ఏపీ ఎన్జీవోలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘మా గడ్డ మీద మేం ర్యాలీలు నిర్వహించుకొనేందుకు అనుమతించరు. దీక్షలు చేపట్టేందుకు అనుమతించరు. మా శాంతియుత నిరసనలను అడ్డుకొంటారు. చివరకు అసెంబ్లీలోకి వెళ్లేందుకు కూడా అనుమతించరు. తెలంగాణ ప్రజలకు హక్కులు ఉండవా? మా గడ్డ విూద సీమాంధ్రుల సభకు అనుమతిస్తారు కానీ మమ్మల్ని అడ్డుకుంటారా?’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డి వ్యవహార శైలికి నిరసనగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ఆవరణలో శాంతి దీక్ష చేపట్టేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీలో శాంతి దీక్ష చేపట్టేందుకు ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా బయల్దేరారు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ బైక్‌పై అసెంబ్లీకి బయల్దేరారు. వారిని పబ్లిక్‌గార్డెన్స్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులపై ఈటెల మండిపడ్డారు. శాసనసభ్యులను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. తమను అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా అవమానించే చర్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు. టీఆర్‌ఎస్ శాసనసభ్యలు హక్కులను కాలరాసిన చీకటి సందర్భం ఇదని మండిపడ్డారు. శాసనసభ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ఎమ్మెల్యేలకు అనుమతి లేదని పోలీసులు నిర్బంధం పెట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకున్న ఈటెల, పోచారంలను పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎదుట గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించేందుకు యత్నించగా, అసెంబ్లీ అధికారులు వారిని అనుమతించలేదు. దీంతో శాసనసభ ప్రాంగణంలోనే ఎమ్మెల్యేలు బైఠాయించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సభలు పెట్టి రెచ్చగొడుతుంది సీమాంధ్ర ప్రభుత్వమేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డి ప్రాంతీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారే సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీ ఎన్జీవోల సమ్మె, ఆందోళనల వెనకు సీఎం కిరణ్ హస్తం ఉందని నిప్పులు చెరిగారు. సీఎం పదవికి కిరణ్ అనర్హుడని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలపై, ఉద్యమంపై పక్షపాతంతో వ్యవహరిస్తూ, తమ శాంతియుత నిరసనలకు అనుమతించకపోవడం అన్యాయమన్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్తుంటే అడ్డుకుంటారా? మనమేమైనా నియంత పాలనలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఏపీ ఎన్జీవోల సభకు అనుమతి ఇవ్వడం ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టి, అల్లకల్లోలం సృష్టించి వచ్చిన తెలంగాణను అడ్డుకోవాలని కుట్ర పన్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడిస్తామన్న సీమాంధ్రుల హెచ్చరికలను ఈటెల కొట్టిపడేశారు. అసెంబ్లీ నుంచి కేవలం అభిప్రాయాన్ని మాత్రమే కోరతారని, తీర్మానం ఓడిందా? గెలిచిందా? అన్నదానితో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై రాష్ట్రపతికి, కేంద్రానికి విశేష అధికారులు ఉన్నాయని తెలిపారు.హైదరాబాద్ వీధుల్లో ఏపీ ఎన్జీవోలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘తలలు తీసేస్తామని సీమాంధ్రులు అంటున్నారు సభకు వచ్చారా? లేక మాపై దండయాత్ర చేయడానికి వచ్చారా?’ అని ప్రశ్నించారు. సభకు ఉద్యోగులు కాకుండా అసాంఘిక శక్తులు కూడా వచ్చాయని మండిపడ్డారు. సీమాంధ్రులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. సమైక్య ఉద్యమం వెనుక సీఎం, డీజీపీ ఉన్నారని.. తక్షణమే వారిద్దరూ పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు.