ఆ నలుగురినీ దోషులుగా తేల్చిన కోర్టు నేడు శిక్ష ఖరారు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10 (జనంసాక్షి) :
దేశాన్ని కదిలించిన ‘నిర్భయ’ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను సాకేత్ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. శిక్షపై దోషుల వాదనలు విన్న అనంతరం బుధవారం తుది తీర్పు వెలువరించనుంది. నలుగురు నిందితులకు బుధవారమే శిక్ష ఖరారు కానుంది. గతేడాది డిసెంబర్ నెలలో పారామెడికల్ విద్యార్థి ‘నిర్భయ’పై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ట్రయల్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే, నిందితులను దోషులుగా నిర్ధారించిన కోర్టు శిక్షపై వాదనలు వినాల్సి ఉన్నందున తుది తీర్పు వాయిదా పడింది. ఇటీవల కేసు విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం పదో తేదీన తీర్పు వెలువరించనున్నట్లు ప్రకటించింది. దీంతో మంగళవారం కోర్టు ప్రాంగణం న్యాయవాదులు, మీడియా, ప్రజాసంఘాలతో కిక్కిరిసిపోయింది. అత్యాచారం కేసులో నలుగురు నిందితులు ముఖేశ్, పవన్‌గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్‌లను కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరికి బుధవారం శిక్షను ఖరారు చేయనున్నట్లు అదనపు సెషన్స్ జడ్జి యోగేశ్ ఖన్నా మంగళవారం ప్రకటించారు. నిందితులు నలుగురిపై 13 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. 84 మంది సాక్షుల వాంగ్మూలాన్ని న్యాయస్థానం నమోదు చేసింది. నిందితులపై హత్య, అత్యాచారం, కిడ్నాప్ నేరాలు నిర్ధారణ అయ్యాయి. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా ప్రధాన నిందితుడు రాంసింగ్ (బస్సు డ్రైవర్) గత మార్చి 11న తీహార్ జైలులోని తన సెల్‌లో ఊరేసుకున్నారు. మరో నిందితుడు మైనర్ కావడంతో అతడికి మూడేళ్ల జైలు శిక్ష ఇప్పటికే ఖరారైంది. దీంతో ఈ కేసులో జీవించి ఉన్న ఐదుగురు నిందితులకు శిక్ష పడినట్లయింది.అంతకుముందు, మంగళవారం ఉదయమే తీహార్ జైలు నుంచి నలుగురు నిందితులను న్యూఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలోని ప్రత్యేక కోర్టు తరలించారు. కిక్కిరిసిన కోర్టు హాలులో న్యాయమూర్తి నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించగానే సందడి నెలకొంది.గతేడాది డిసెంబర్ 16న ఢిల్లీ నడివీధుల్లో మహిళపై అత్యంత పాశవిక దాడి జరిగింది. ఆరుగురు నిందితులు కదులుతున్న బస్సులో తిప్పుతూ యువతిపై కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేయడమే కాకుండా తీవ్రంగా గాయపరిచారు. ఆమె స్నేహితుడిపైనా దాడి చేశారు. ఇద్దరిని బస్సు నుంచి తోసేసి, హత్య చేసేందుకూ యత్నించారు. తీవ్రంగా ఆమె డిసెంబర్ 29న సింగపూర్ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యువశక్తిని కదిలించింది. అతివపై జరుగుతున్న దాడులను దేశం ముక్తకంఠంతో ఖండించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అత్యాచారాల నిరోధక చట్టానికి మరింత పదును పెడుతూ ‘నిర్భయ’ చట్టం తీసుకొచ్చింది. ఈ కేసు విచారణకు ఏర్పాటైన ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ తొమ్మిది నెలల విచారణ అనంతరం నలుగురు నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. బుధవారం శిక్ష ఖరారు చేయనుంది.