తెలుగుజాతి అంటే ఎవరు?
తెలుగుజాతిని నాశనం చేస్తున్నారు. తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకుంది. ఎన్‌డీఏ హయాంలో తెలంగాణను నేనే అడ్డుకున్న. అప్పటి ప్రధాని వాజపేయి తెలంగాణపై నిర్ణయం తీసుకోకుండా చూశా. తెలుగు జాతి మధ్య చిచ్చుపెట్టాలని చూసే వారికి పుట్టగతులుండవ్. రాహుల్‌ను ప్రధాని చేయడానికే తెలుగువారి విచ్ఛిన్నం చేస్తున్నారు. అని సీమాంధ్ర ప్రాంతంలో తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న చంద్రబాబు ప్రతిచోట చెప్తూ పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఒకింత అసహనం, అంతకుమించిన అశక్తతత, పైకి మేకపోతు గాంభీర్యంతో చంద్రబాబు మాట్లాడుతుంటే తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంత బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తారా అనే సందేహం కలుగుతోంది. అసలు తెలుగుజాతి అంటే ఎవరు? తెలుగుజాతిలో ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరిని చంద్రబాబు తెలుగుజాతిలో భాగస్వాములుగా చూస్తున్నాడు? అనే ప్రశ్నలకు వెదుక్కునే పనిలో తెలంగాణ సమాజం ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు గొంతు చించుకొని అరుస్తున్నాడే కానీ తాను అధికారం వెలగబెట్టినప్పుడు తెలంగాణ ప్రజల కోసం ఏం చేశాడు? అభివృద్ధి అంటే ఒక్క హైదరాబాద్‌లో రోడ్లేనా? అంటే మాత్రం సమాధానముండదు. చంద్రబాబు సీమాంధ్రలో నిర్వహిస్తున్న ఆత్మగౌరవ యాత్రలో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నది హైదరాబాద్ నగర అభివృద్ధి గురించి. అప్పుడు ప్రాంతాలకతీతంగా హైదరాబాద్‌ను సింగపూర్‌లా అభివృద్ధి చేశానని చెప్తున్నాడు. బాబు అధికారం వెలగబెట్టిన సమయంలో ఆయన పార్టీ భాగస్వామిగా ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం స్వర్ణ చతుర్భుజి పథకం ద్వారా హైవే రోడ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఆ నిధులను తెచ్చి ఇక్కడ రోడ్లు వేయించినట్టుగా బాబు గొప్పలు చెప్పుకుంటున్నాడు. స్వాతంత్య్రానికి పూర్వమే దేశంలో నాలుగో అభివృద్ధి చెందిన నగరంగా ఉన్న హైదరాబాద్ కాలక్రమంలో మరింత అభివృద్ధిని తన ఖాతాలో వేసుకుంది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలోకి ప్రవేశించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తర్వాత పెద్ద నగరాలన్నింటికీ విస్తరించింది. ఈ క్రమంలో ఐటీ హబ్‌గా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్‌లో మెరుగైన రవాణా సౌకర్యాల కోసం ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతోనే హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టారు. తద్వారా హైదరాబాద్ చారిత్రక వారసత్వ కట్టడాలను కూడా రూపుమాపారు. హైటెక్ సిటీని చారిత్రక చార్మినార్‌గా పోటీగా నిలపాలని చంద్రబాబు పన్నని కుట్రలు లేవు. అలాంటి చంద్రబాబు కాలక్రమంలో వచ్చిన అభివృద్ధి తన ఖాతాలో వేసుకొని సీమాంధ్రులను రెచ్చగొట్ట చూస్తున్నాడు. సీమాంధ్ర ప్రాంతంలో చదువుకునే పిల్లలంతా నిరుద్యోగులగా మారుతారని మొసలి కన్నీరు కారుస్తున్నాడు. తెలంగాణ ప్రజల రక్తమాంసాలతో నిర్మించిన హైదరాబాద్‌ను కొళ్లగొట్టి తమ వాళ్లకు దారాదత్తం చేసిన వారిలో పేరెన్నికగన్న వ్యక్తి చంద్రబాబు. తెలంగాణ వనరులు సీమాంధ్ర ప్రాంత పారిశ్రామిక వేత్తలకు దోచిపెట్టి వాటిలో ఆ 13 జిల్లాలకు చెందిన వారికే ఉద్యోగావకాశాలు కల్పించారు. ఒకవేళ తెలంగాణ వారికి ఉద్యోగాలిచ్చినా నాలుగో తరగతికి మాత్రమే పరిమితం చేశారు. ఎంతో నైపుణ్యం ఉన్న వారికి కూడా సరైన అవకాశాలు కల్పించలేని దుర్మార్గపుబుద్ధి సీమాంధ్ర పెత్తందారులది. తెలంగాణ ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన ఉద్యోగాలను అప్పనంగా కొళ్లగొట్టి దొంగతనంగా హైదరాబాద్‌లో తిష్టవేసిన వారి పక్షాన చంద్రబాబు సీమాంధ్రలో యాత్రకు బయల్దేరారు. వచ్చిన తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులను రెచ్చగొట్టడానికి ఆయన ప్రతి అడుగును ముందుకేస్తున్నాడు. పది మంది గుమిగూడిన ప్రతిచోట రాజకీయ అజ్ఞానిలా మాట్లాడుతున్నాడు. సోనియాగాంధీని టార్గెట్ చేయడం ద్వారా తన రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ప్రయాసే తప్ప అసలు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు. తెలంగాణ ఏర్పాటు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన సీమాంధ్ర ప్రాంతంలో యాత్ర చేయడం ద్వారా ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నాడు. తెలంగాణ ప్రాంతంలోనూ రాజకీయ అస్తిత్వాన్ని కోరుకునే చంద్రబాబు సీమాంధ్రలో చెప్తున్న మాటలు, ఆ సందర్భంలో ఆయన హావభావాలు తెలంగాణ ఏర్పాటే పాపం అనే రీతిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఎలా చూడాలి అనేదానికి టీ టీడీపీ నేతలు నిస్సిగ్గుగా సమాధానాలిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలకు భరోసా ఇచ్చేందుకే తమ నేత అక్కడ యాత్ర చేస్తున్నాడని ఒకరంటే, కాంగ్రెస్ టీడీపీని రాజకీయంగా అంతం చేయాలని చూసింది కాబట్టే బాబు అలా మాట్లాడాల్సి వస్తోందని ఇంకొకరంటున్నారు. రాజకీయ ప్రాతినిథ్యం కోరుకునే చంద్రబాబు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వ మొదటి ప్రకటన (2009 డిసెంబర్ 9) తర్వాత ఇరు ప్రాంతాల నేతలను వేర్వుగా ఉద్యమించాలని ఆదేశించాడు. ఆ మాట ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు కూడా. ఇరు ప్రాంతాల వారిని ఆందోళన చేసుకోమన్ననని గుంటూరు జిల్లాలో చెప్పాడు. ఆ రోజు ఆందోళన చేసుకోమని చెప్పిన బాబు ఈ రోజు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియ ప్రారంభించాక తెలుగుజాతి, తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో గావుకేకలు పెట్టడాన్ని ఏమనుకోవాలి. అంటే తెలంగాణ ఉద్యమంలో న్యాయం లేదని చంద్రబాబు చెప్తున్నట్టు అనుకోవాలా? తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్నది నిజం కాదని బాబు చెప్పదలుచుకున్నాడా? ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి తెలంగాణకు చెందాల్సినవన్నీ సీమాంధ్రులు దోచుకోవడం వల్లే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకున్నది నిజం కాదని బాబు అంటున్నాడా? సీమాంధ్రలోని 80 శాతం మంది హైదరాబాద్‌పై ఆధారపడి బతుకుతున్నారని చెప్తున్న చంద్రబాబు అంతస్థాయిలో తెలంగాణ అన్యాయం జరిగిందని ఎందుకు ఒప్పుకోడు. కడుపులో విషం నింపుకొని ఇంతకాలం నవ్వుతూ మాట్లాడిన చంద్రబాబులాంటి వ్యక్తులను కూడా ఆదరించిన గొప్ప మనస్తత్వం తెలంగాణ ప్రజలది. అలాంటి ప్రజల బతుకుల్లో నింపులు పోసిన వారిలో ముఖ్యుడు చంద్రబాబు. ఇన్నాళ్ల దోపిడీ, పీడన నుంచి తెలంగాణ వారికి విముక్తి లభించే వేళ ఆయన చేస్తున్న కుట్ర రాజకీయాలు? తెలుగుజాతి పేరిట ఆడుతున్న నాటకాలు సభ్యసమాజాన్ని సిగ్గుతో తలవంచుకునేలా చేస్తున్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలను విభజనకు సమాయత్తం చేయాల్సిన సమయంలో బాబు చిచ్చుపెట్టే యాత్ర చేపట్టాక కూడా ఆయనకు, ఆయన పార్టీకి తెలంగాణ చోటు అవసరమా? దీనిని తేల్చుకోవాల్సింది తెలంగాణ ప్రజలు కాదు టీ టీడీపీ నేతలు.