తెలంగాణ వాదులపై ఆగని సీమాంధ్రుల దౌర్జన్యాలు

– గద్వాల విద్యార్థిపై సీమ ఇంజినీర్‌ రుబాబు
– జై సమైక్యాంధ్ర నినాదాలు.. రెచ్చగొట్టే మాటలు
– చైన్నైఎక్స్‌వూపెస్‌లో ఘటన, పోలీసులకు ఫిర్యాదు..
– కేసు పెట్టొద్దని కాళ్లబేరం..వదిలేసిన విద్యార్థులు
గద్వాలరూలల్‌,అక్టోబర్‌ 1(జనంసాక్షి) : సమైక్యవాదుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. రాయలసీమలో తెలంగాణవాసులపై దాడులు, దౌర్జన్యాలకు బరితెగిస్తున్న విషయం తెలిసిందే. చుట్టూ మనవాళ్లే ఉన్నారనుకుంటే రెచ్చిపోతున్న సీమ పౌరుషం, వ్యతిరేక వర్గం వచ్చాక తోకముడుస్తోంది. మంగళవారం పాలమూరు విద్యార్థికి ఈ అనుభవం ఎదురైంది. గద్వాలకు చెందిన బీటెక్‌ విద్యార్థి రవీందర్‌రెడ్డి వ్యక్తిగత పనిపై మహబూబ్‌నగర్‌కు వెళ్లాడు. తిరిగి గద్వాలకు వచ్చేందుకు కాచిగూడ నుంచి చెన్నైకు వెళ్లే చెన్నై ఎక్స్‌వూపెస్‌ ఎక్కి సీటు కోసం ప్రయత్నించినా దొరకలేదు. హైదరాబాద్‌ నుంచి రైలులో వస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన యువ ఇంజినీర్‌ రమేశ్‌ జోక్యం చేసుకొని రవీందర్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. రాయలసీమ వాళ్లను తెలంగాణ వాళ్లు ఏమీ చేయలేరంటూ దౌర్జన్యాంగా వ్యవహరించాడు. గద్వాల దగ్గరకు వస్తున్న అతడి తీరులో మార్పురాలేదు. జై సమైక్యాంధ్ర, సమైక్యాంధ్ర జిందాబాద్‌ అని అంటూ గట్టిగా నినాదాలు చేయడం. అతనికి కడపకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్‌ వంతపాడటంతో ఇంకా రెచ్చిపోయాడు. తోటి ప్రయాణికులు సర్దిచెప్పినా ఆగలేదు. అప్పటి వరకు ఓపిక పట్టిన రవీందర్‌, ఇక లాభం లేదనుకుని గద్వాలకు చెందిన విద్యార్థి సంఘాలకు సమాచారం చేరవేయగా, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కనికరం చూపిన రవీందర్‌ గద్వాల్‌లో రైలు ఆగగానే రమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటిదాకా కల్లుతాగిన కోతిలా ప్రవర్తించిన రమేశ్‌, ఒక్కసారిగా కుడితిలో పడ్డ ఎలకలా గిలగిలాడిపోయాడు. తప్పు చేశానని, క్షమించాలంటూ వేడుకున్నాడు. తనపై కేసు నమోదు చేస్తే ఉద్యోగం పోతుందని పోలీసులు, బాధితుల కాళ్లావేళ్లాపడ్డాడు. ఓ ప్రాంతం వారి మనస్తత్వాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించవద్దని అతనికి విద్యార్థిలు హితవు పలికారు. తెలంగాణ ప్రజల్లో ఇంత కరుణ ఉంటుందని ఇప్పుడే తెలిసిందని రమేశ్‌ అపరాధబావం వ్యక్తం చేశాడు. కేసు పెట్టకుండా అతడిని అదే సమయంలో వచ్చే బెంగళూర్‌ ఎక్స్‌వూపెస్‌లో ఎక్కించి పంపించారు.