బాలికపై ఆగని అకృత్యాలు
– పాలమురు జిల్లాలో చిన్నారిపై బావ లైంగికదాడి
– ఖమ్మం జిల్లాలో విద్యార్థినిపై గురువు కీచకం
– భైంసాలో కుతురిపై తండ్రి అఘాయిత్యం
కొత్తకోట/ఖమ్మం రూరల్/ భైంసా, అక్టోబర్ 1 (జనంసాక్షి) : నిర్భయ చట్టాలు అమలు చేస్తూ ఉరిశిక్షలు విధిస్తున్నా, కఠిన శిక్షలు విధిస్తున్నా అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. మూడు చోట్ల బాలికలపై అఘాయిత్యాలు చోటుచేసుకున్న ఘటనలు మంగళవారం వెలుగుచూశాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరుకు చెందిన బాలిక (7) కొత్తకోట మండలంలోని ఓ తండాకు చెందిన అక్క, బావల వద్ద ఉంటోంది. చిన్నారిపై బావ రాత్లావత్ హన్మంత్‌నాయక్ సోమవారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావమవడంతో దెబ్బ తగిలిందంటూ కూలి పనులకు వెళ్లి వచ్చిన భార్యను హన్మంత్‌నాయక్ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ బాలిక అసలు విషయం చెప్పడంతో తండావాసులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. హన్మంత్‌నాయక్‌పై నిర్భయ చట్టం కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ మహేశ్వర్‌రావు తెలిపారు.
మరో ఘటనలో ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని హాస్టల్‌లో ఉంటూ పదోతరగతి చదువుతోంది. ఇదే పాఠశాలలో ఉపాధాయుడిగా పనిచేస్తున్న తల్లాడ మండలం నూతనకల్‌కు చెందిన సుధాకర్ బాలికను ప్రేమ పేరుతో లోబరుచున్నాడు. ట్యూషన్ చెబుతానని ఏడాదికాలంగా ఇంటికి తీసుకెళ్తూ లైగింకదాడి జరిపాడు. ఎవరికి చెప్పొద్దని, మార్కులు బాగా వేస్తానని మభ్యపెట్టాడు. ఇటీవల పాఠశాలకు రెండురోజులు సెలవురావడంతో ఇంటికి వెళ్లిన బాలిక ఉపాధ్యాయుడితో సెల్‌ఫోన్‌లో చనువుగా మాట్లాడటం తల్లిదండ్రులు గమనించి నిలదీశారు. తండ్రి పోలీసులను ఆశ్రయించగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకో ఘటనలో ఆదిలాబాద్ జిల్లా భైంసాకు చెందిన ఓ వ్యక్తి (52)మొదటి భార్య మృతిచెందడంతో, కొద్దికాలం కిందట రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు కూతుళ్లున్నారు. చిన్నకూతురు (13)పై ఎనిమిది నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. బాలిక మంగళవారం తన భావ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని బాలికను వైద్యచికిత్సల నిమిత్తం నిర్మల్‌కు తరలించారు.