భారత హాకీ జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా మన్‌ప్రీత్‌సింగ్‌

న్యూఢిల్లీ ,అక్టోబర్‌ 28 (జనంసాక్షి) :
వచ్చే నెలలో జరగనున్న మూడో ఏషియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత హాకీ జట్టును ప్రకటించారు. ఈ టోర్నీకి కెప్టెన్‌ సర్థార్‌సింగ్‌కు విశ్రాంతినివ్వడంతో పాటు ఎక్కువశాతం యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు. మిడ్‌ఫీల్డన్‌ మన్‌ప్రీత్‌సింగ్‌ను తాత్కాలిక సారథిగా ఎంపిక చేశారు. ఇటీవల ఇంఫోలో జరిగిన సుల్తాన్‌ ఆఫ్‌ జొహర్‌కప్‌లో భారత జూనియర్‌ జట్టుకు మన్‌ప్రీత్‌ సారథ్యం వహించాడు. వచ్చే జూనియర్‌ వరల్డ్‌కప్‌కు సన్నాహాకంగా ఆసియాఛాంపియన్స్‌ ట్రోఫీ ఉపయోగపడుతుందని భారత హాకీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే 18 మందితో కూడిన జాబితాలో 13 మంది యువజట్టులో వారే. కొతాజీత్‌సింగ్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. నవంబర్‌ 2 నుండి 10 వరకూ ఈ టోర్నీకి జపాన్‌ ఆతిథ్యమిస్తోంది. భారత్‌, చైనా, జపాన్‌, మలేషియా, పాకిస్థాన్‌తో పాటు ఒమన్‌ జట్లు దీనిలో పాల్గొంటున్నాయి. భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో నవంబర్‌ 2న చైనాతో తలపడుతుంది. తర్వాత జపాన్‌, ఒమన్‌, పాకిస్థాన్‌, మలేషియాతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ తొలి ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్‌ గత ఏడాది రన్నరప్‌తో సరిపెట్టుకుంది.