విభజన తర్వాత కూడా వివాదాలు పరిష్కరించుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందే హైదరాబాద్‌పై హక్కులు, నదీ జలాల కేటాయింపు, అప్పులు, ఆస్తుల బదలాయింపు, విద్యుత్‌, వనరుల పంపిణీ ఇతరత్రా వ్యవహారాలన్నీ చక్కబెట్టాలని సీమాంధ్ర ప్రాంత ప్రజలు కోరుతున్నారు. వారిలో ఎక్కువ మంద నదీ జలాలు, విద్యుత్‌, వనరులు, ఆస్తులు, అప్పుల పంపిణీని ప్రధానంగా ప్రస్తవిస్తున్నారు. కేవలం పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు, హైదరాబాద్‌లో అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారు మాత్రం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని, దాని పరిధి, పరిపాలన వ్యవహారాలపై చర్చలు లేవనెత్తుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోతున్న సందర్భంలో ఇరు ప్రాంతాలకు ఆస్తులు, అప్పులు, ఇతరత్రా బదలాయింపులపై చర్చించుకోవడం సహజమే. కానీ ఈ సందర్భంలో సీమాంధ్రులు చేస్తున్న డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. రాష్ట్ర విభజనకు ముందే ముఖ్యంగా నదీజలాల కేటాయింపులు పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. నదీజలాల కేటాయింపులపై వారిలో సందేహాలు తలెత్తడానికి కారణం తెలంగాణ ప్రాంతం ఎగువన ఉండడమేనంటున్నారు. తెలంగాణ ఎగువన ఉంది కాబట్టి తమ ప్రాంతానికి నీళ్లు రానివ్వరని వితండ వాదన చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన నదులు రెండు. కృష్ణా, గోదావరి. ఈ రెండు నదులను మనం వివిధ రాష్ట్రాలతో కలిసి పంచుకుంటున్నాం. మిగతా రాష్ట్రాలతో నీటి వాటాల పంపకంపై ఏ విధానమైతే అమల్లో ఉందో అదే విధానం విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకూ వర్తిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ కంటే ముందే ఎన్నో రాష్ట్రాలు విడిపోయి కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో పంపకాల్లో ఎలాంటి విధానాలైతే పాటించారో అవే విధానాలు ఇక్కడా పాటిస్తారు. దీనిపై సీమాంధ్రులు ఎందుకు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారో వారికే తెలియదు. కృష్ణా, గోదావరి నదులు పారే ప్రాంతం తెలంగాణలోనే ఎక్కువున్నప్పటికీ వాటి వల్ల లబ్ధిపొందుతున్న ప్రాంతం మాత్రం ఆంధ్రానే అనేది నూటికి నూరుపాళ్లు నిజం. ప్రాజెక్టుల మూలంగా తెలంగాణ ప్రాంతం ముంపునకు గురై, ఇక్కడి ప్రజలు నిర్వాసితులైతే సీమాంధ్ర ప్రాంతంలో భూములకు సాగునీరందుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అత్యధిక కాలం పరిపాలించింది సీమాంధ్ర ప్రాంత నాయకులే. రాయలసీమ ప్రాంతీయుల పరిపాలనకాలమే అత్యధికం. రాష్ట్ర పాలన పగ్గాలే వారి చేతిలో ఉన్నాయి కాబట్టి ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కట్టేసి నీటిని తమ ప్రాంతానికి తరలించుకుపోయారు. కృష్ణా బేసిన్‌కు మూడో పంట నీరందించడానికి నదుల అనుసంధానం అనే కొత్త కార్యక్రమానికి తెరతీశారు. తద్వారా తెలంగాణ ప్రాంత బీడు భూములను సాగులోకి తీసుకురావాలనే విషయాన్ని మరిచి తమ ప్రాంతానికి మూడో పంటకు నీరు ఇచ్చేందుకు కుట్ర పన్నారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటుతో నదుల అనుసంధానం ఆగిపోతుందని, ఫలితంగా కోస్తాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే అసంబద్ధ వాదనకు తెరతీశారు. కృష్ణా, గోదావరి నదుల్లో కృష్ణా నదికి మాత్రమే తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలతో సంబంధముంది. గోదావరి నది తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో మాత్రమే ప్రవహిస్తోంది. ఈ నదీ జలాల వాటా పంపిణీకి సంబంధించి రాయలసీమతో సంబంధం లేదు. గోదావరినదిలో ఆంధ్రప్రదేశ్‌ వాటా 1495 టీఎంసీలు కాగా ఆ నీటినే మన రాష్ట్రం పూర్తిగా వినియోగించుకోలేకపోతోంది. ఇచ్చంపల్లి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే సముద్రంలో వృథాగా కలుస్తున్న 600 టీఎంసీల నీటిలో కొంత వినియోగించుకోవచ్చు. అయితే ప్రస్తుతమున్న డిజైన్‌లో పోలవరం నిర్మాణానికి తెలంగాణ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరు. సుమారు 300 గిరిజన గూడాల్ని, రిజర్వ్‌ ఫారెస్టును ముంచేసే ఈ ప్రాజెక్టు డిజైన్‌ మార్చాల్సిందేనని ఆదివాసీ సంఘాలు, తెలంగాణ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక కృష్ణా నదిలో నీటిని బచావత్‌ ట్రిబ్యునల్‌ 800 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు, 695 టీఎంసీలు కర్ణాటకకు, 565 టీఎంసీలు మహారాష్ట్రకు కేటాయించింది. ఈ నదీ జలాల పంపిణీకి సంబంధించిన వివాదం ట్రిబ్యునల్‌ వద్ద విచారణ జరుగుతోంది. గోదావరి నదిపై నిజామాబాద్‌ జిల్లాలో నిర్మించిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ సహా పలు ఆనకట్టలను అక్రమంగా నిర్మించింది. తెలంగాణ ఏర్పడ్డాక ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాబ్లీ మాదిరిగానే అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుందేమోననే సందేహం అక్కడి నేతలు వ్యక్తం చేస్తున్నారు. బాబ్లీ సహా మహారాష్ట్ర నిర్మించిన అక్రమ ఆనకట్టలపై ట్రిబ్యునల్‌లో వాదనలు కొనసాగుతున్నాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల బాబ్లీ కేసును మన ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఓడింది కాని మహారాష్ట్ర చేసింది సరైన చర్య అని సుప్రీం సమర్థించలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించడంలో కిరణ్‌ విఫలమయ్యాడు. పైపెచ్చు బాబ్లీ తీర్పుపై అప్పీలుకు వెళ్లాల్సిన అవసరం లేదంటూ మాట్లాడి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయనే నీటి కోసం ఇరు ప్రాంతాల మధ్య యుద్ధాలొస్తాయంటూ సీమాంధ్రులను తప్పుదోవపట్టిస్తున్నాడు. కిరణ్‌కు సాగునీటి రంగంపై ఉన్న పరిజ్ఞానం ఏపాటిదో బాబ్లీ వ్యవహారంలోనే తేలిపోయింది. ఆయనే కాదు సీమాంధ్రకు చెందిన ఏ ఒక్కరికి నీటి కేటాయింపులు, బదలాయింపులపై సందేహాలు అవసరం లేదు. మన దేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్‌తో ఐదు నదులను పంచుకుంటున్నాం. మనకు ఎగువన ఉన్న చైనాతోనూ నదీ జలాలను మనం పంచుకుంటున్నాం. ఒక్క భారత్‌ మాత్రమే కాదు ప్రపంచంలోని అనేక దేశాలు నదులను పంచుకుంటున్నాయి. వాటి మధ్య తలెత్తే సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ ట్రిబ్యునళ్లు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వేరుపడ్డంత మాత్రన గోదావరి నదీజలాలు, కృష్ణా నదీ జలాలపై వేసిన ట్రిబ్యునళ్లు మాత్రం అలాగే ఉన్నాయి. ఇరు ప్రాంతాలకు నీటి కేటాయింపులు కూడా సహేతుకంగా, శాస్త్రీయంగానే జరుగుతాయి. అది రాష్ట్ర విభజనకు ముందే తేలాలని పట్టుబట్టడం సహేతుకం కాదు. నదీ జలాల పంపిణీని ట్రిబ్యునళ్లు, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ)కు లోబడి చేసుకోవచ్చు. దీనిని రాద్దాంతం చేయడం తగదు. అలాగే ఆస్తులు, అప్పులు, విద్యుత్‌, వనరుల పంపిణీ, ఇతర ప్రధాన సమస్యలు. వీటిని ఇరు ప్రాంతాల పెద్దలు కూర్చొని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చు. అదే యోచనలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతటి జఠిల సమస్యకైనా చర్చల ద్వారా పరిష్కారం కనుగొనవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో తలెత్తే సమస్యలు ఇందుకు అతీతమేమీ కాదు. పరిష్కారం కనుగొనాలనే చిత్తశుద్ధితోనే ఇరు ప్రాంతాల నేతలు సంప్రదింపులకు సిద్ధపడాలి. ఇది విభజన తర్వాత కూడా సాధ్యమే.