సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్
ఎవరేం మాట్లాడినా చెల్లదు
రేపు నేను హైదరాబాద్ వస్తున్నా
పరిస్థితి చక్కదిద్దుతా : దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 10 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయమే ఫైనల్ అని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ మరోమారు తేల్చిచెప్పారు. పార్టీ అత్యున్నత కమిటీ నిర్ణయాన్ని దిక్కరించి ఏవరేం మాట్లాడినా చెల్లబోదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న 12న తాను హైదరాబాద్‌కు వెళ్తున్నానని చెప్పారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దుతాయనని తెలిపారు. సొంత పార్టీ పార్లమెంట్ సభ్యులు యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం బాధాకరంగా ఉందని దిగ్విజయ్ అన్నారు. అయితే దీనిని అధిగమిస్తామని తెలిపారు. పలువురు సీమాంధ్ర ఎంపీలతో సంప్రదింపులు జరిపామని, నోటీసులు ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. జేసీ దివాకర్ రెడ్డి సోనియాపై ఎలాంటి పరిస్థితుల్లో వ్యాఖ్యలు చేశారో తెలుసుకుంటున్నానని చెప్పారు. సీఎం కిరణ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సీఎం అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారని భావించడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఐదు రాష్ట్రల ఎన్నికల ఫలితాలు చూపవని తెలిపారు.