తెలంగాణ ముసాయిదా ప్రవేశపెట్టండి
371(డి) ముచ్చేటేకాదు శ్రీటీడీపీ ఆంధ్రా పార్టీ
తెలంగాణల ఎట్లుంటుది: కేసీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 15 (జనంసాక్షి) :
తెలంగాణ ముసాయిదా వెంటనే శాసనసభలో ప్రవేశపెట్టాలని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు డిమాండ్ చేశారు. బిల్లుపై అసెంబ్లీలో సోమవార చర్చ ప్రారంభించాలి అని ఆయన కోరారు. తెలంగాణ భవన్‌లో ఆదివా రం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం నుంచి అసెంబ్లీలో పార్టీ ఎమ్మె ల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు తెలిసింది. సమావేశం అనంతరం మీడియాతో కేసీఆర్ మాటా ్లడారు. అసెంబ్లీకి వచ్చింది ముసాయిదా బిల్లు అని చెప్పారు. సభ్యులు తమ అభిప్రాయాలను చెబితే సరిపోతుందన్నారు. బిల్లుపై సోమవారం నుంచి చర్చ చేపట్టకపోతే రాష్ట్రపతిని అవమానించినట్టేనని అన్నారు. రాష్ట్రాలను ఏర్పాటు చేసే విశేషాధికారం కేంద్రానిదేనని అన్నారు. ఏవైనా సవరణలు ఉంటే పార్లమెంటులో ప్రవేశపెట్టేటప్పుడు పొందు పరిస్తే సరిపోతుందన్నారు. విభజనలో అసెంబ్లీకి ఎటువంటి పాత్ర ఉండబోదన్నారు. తెలంగాణ ఇచ్చేందుకు యూపీఏ కృతనిశ్చయంతో ఉంది. రాష్ట్రపతి నుంచి వచ్చిన సమాచారాన్ని స్పీకర్ టేబుల్‌పై పెట్టాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయినట్టే లెక్క. తెలంగాణ బిల్లును ఎవరూ అడ్డుకోలేరన్నారు. అసెంబ్లీలో బిల్లులో ఉన్న లొసుగులపై కేవలం అభిప్రాయాలు చెప్పడమేనన్నారు. ముసాయిదా బిల్లులో ఉన్నది సరళమైన ఆంగ్లమేనని అన్నారు. ముసాయిదా బిల్లుపై కేవలం అభిప్రాయాలను మాత్రమే తెలుసుకుంటారన్నారు. ఓటింగ్ ఉండబోదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే యత్నాలను సీమాంధ్రులు మానుకోవాలన్నారు. విభజన ఉద్యమం రావడానికి సీమాంధ్ర పాలకులే కారణమన్నారు. హర్యానా ఏర్పాటు సమయంలో అసెంబ్లీకి బిల్లు పంపలేదన్నారు. రాష్ట్ర విభజనకు 371 (డి) సవరణ అవసరం లేదు. రాష్ట్ర ఏర్పాటుకు 371 (డి) అడ్డంకి కాదని హైకోర్టే స్పష్టం చేసిందన్నారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయినవాడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీమాంధ్రలోనైనా నాలుగు ఓట్లు రాలతాయని చంద్రబాబు ఆరాటపడుతున్నారన్నారు. సమైక్య వాదన వదిలేసి సీమాంధ్రకు ఏమేమీ కావాలో అడిగితే బాగుంటుందన్నారు. ఈ సమయంలో తెలంగాణను అపాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. చంద్రబాబు ఆంధ్రా ప్రాంత నాయకుడు ఆయన అక్కడేం చేసుకుంటే తమకు అనవసరమన్నారు. ఆంధ్రలో ఓట్ల కోసమే చంద్రబాబు, జగన్ సమైక్య నినాదాలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో ఆంధ్రా పార్టీలకు చోటు లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నది అనివార్యత దాన్నెవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.