ఇకనైనా గారడీలు ఆపండి
చర్చ చేపట్టండి : ఈటెల
హైదరాబాద్, డిసెంబర్ 17 (జనంసాక్షి) :
తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు, ఇందుకు చేస్తున్న గారడీలు ఆపాలని టీఆర్‌ఎస్ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్ర విభజనపై సోమవారమే చర్చ ప్రారంభమైందని, దీనిపై రాద్దాంతం చేయకుండా చర్చకు సహకరించి సీమాంధ్రకు ఏం కావాలో డిమాండ్ చేసుకోవాలని ఈటెల డిమాండ్ చేశారు. అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత మీడియా పాయింట్‌కు చేరుకున్న ఈటెల మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలపై ప్రేమ ఉంటే వారి సమస్యలపై చర్చించాలన్నారు, కుట్రలు కుతంత్రాలతో బిల్లుపై చర్చను అడ్డుకుంటామంటే ఊరుకునేది లేదన్నారు. బిల్లును ఆపే క్రమంలో సీమాంద్రులు గుండాల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా ముసాయిదా బిల్లుపై చర్చించాలని ఈటె ల డిమాండ్ చేశారు. సోమవారం స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటి స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కపై సీమాంధ్రులు వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉందన్నారు. చర్చ ప్రారంభం కాలేదని చూపించడం శోచనీయమన్నారు. స్పీకర్ తన విద్యుక్త దర్మాన్ని నిర్వహించాలని కోరారు. సీమాంధ్రకు చెందిన సిఎం, బాబులు స్పీకర్ పై ఒత్తిడి చేసి సభను వాయిదా వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. చర్చ ఇప్పటికే ప్రారంభం అయిందని, తక్షణమే బిఎసి సమావేశ పరిచి పార్టీల వారిగా, సంఖ్య ఆధారంగా సమయం కేటాయించాలని ఈటెల స్పీకర్‌ను కోరారు. తక్షణమే బిల్లుపై చర్చను కొనసాగించాలని ఈటెల డిమాండ్ చేశారు. సీమాంధ్ర నేతలు ముఖ్యమంత్రితో సహా ప్రతిపక్ష నేత సాగదీయాలని చూసినా, సమావేశాలు వాయిదా వేయాలని చూసినా తగిన రీతుల్లో గుణపాఠం చెపుతామతీ ఈటెల హెచ్చరించారు.