రాష్ట్రపతికి విన్నపాల వెల్లువ

సీఎం మర్యాదపూర్వక భేటీ
గడువు పొడిగించవద్దు : ఎంపీ వివేక్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌ 22 (జనంసాక్షి) :
శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వచ్చిన భారత ప్రథమ పౌరుడు ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీ ఆదివారం కూడా బిజీబిజీగా గడిపారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన నేతలంతా ఆయన్ను కలవడానికి క్యూకట్టారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ త్వరగా ముగించాలని ఈ ప్రాంత నేతలు కోరగా, సమైక్య రాష్ట్రాన్నే కొనసాగించాలని సీమాంధ్ర నాయకులు ఆయనకు వినతిపత్రాలు, నోట్లు సమర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుమారు గంటపాటు వీరు చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర విభజనకు సంబంధించి తెలెత్తే అంశాలను ముఖ్యమంత్రి వివరించినట్టు సమాచారం. అయితే వీటిలో ప్రధానంగా తాగునీటి సమస్య, నదీ జలాల సమస్య, నిరుద్యోగ సమస్య, రాష్ట్ర సరిహద్దుల సమస్య, భద్రాచలం, ఇతర ప్రాంతాల గురించి ముఖ్యమంత్రి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ బిల్లును పూర్తి వివరాలు లేవని కూడా ముఖ్యమంత్రి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అంతేకాకుండా విభజనపై సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత గురించి వివరించినట్టు తెలిసింది. అయితే శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతిని ఆనవాయితీ ప్రకారం ముఖ్యమంత్రి కలిసినట్టు సీఎం కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. సీమాంధ్ర టీడీపీ నేతలు ప్రణబ్‌ను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరగా, పెద్దపల్లి ఎంపీ వివేక్‌, నాగర్‌కర్నూల్‌ ఎంపీ మంద జగన్నాథం, మాజీ మంత్రి జి. వినోద్‌ రాష్ట్రపతిని కలిసి తెలంగాణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ముసాయిదా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపినందున ఇప్పుడు ఏమీ మాట్లాడబోనని, తన వద్దకు వచ్చిన తర్వాత పరిశీలిస్తానని ప్రణబ్‌ చెప్పినట్లు వివేక్‌ మీడియాకు తెలిపారు.