సీఎం రాష్ట్రపతిని పదే పదే కలవడంలో ఆంతర్యమేంటి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదా శాసనసభ, శాసనమండలి అభిప్రాయం కోసం రాష్ట్రానికి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటానని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానని పదే పదే ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని పదేపదే కలడంలో ఆంతర్యమేమిటీ. రాష్ట్రపతి వచ్చిందే శీతాకాల విడిది కోసం. విశ్రాంతి కోసం వచ్చిన ప్రథమ పౌరుడిని సమైక్యవాదిగా చెప్పుకునే కిరణ్ తరచూ కలవడాన్ని తెలంగాణ పౌర సమాజం వ్యతిరేకిస్తోంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రాజ్యాంగ పరిరక్షుడైన రాష్ట్రపతిని కలిసి ఏం కోరుతున్నాడు. గంటల తరబడి భేటీలు నిర్వహిస్తూ ఆయన చెవిలో ఏమి రొద పెడుతున్నాడు? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి. మూడేళ్ల క్రితం ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పలు సందర్భాల్లో, బహిరంగ వేదికలపైనా ఇదే విషయం చెప్పాడు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడానికి ముందు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తెలంగాణపై నిర్ణయం తీసుకోబోవడానికి ముందు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ యథా స్థితిలో కొనసాగింపు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై అభిప్రాయం చెప్పాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎం కిరణ్, డెప్యూటీ సీఎం రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను కోరింది. ఎవరికివారుగా అధిష్టానానికి నివేదికలు సమర్పించిన ముగ్గురు నేతలు ఎవరి వాదన వారు వినిపించారు. ముఖ్యమంత్రి కిరణ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ రాష్ట్రం సమైక్యంగా ఉంటే కలిగే ప్రయోజనాల పేరుతో అధిష్టానం పెద్దలకు కాకమ్మ కథనే చెప్పాడు. సావధానంగా ఉన్న అధిష్టానం పెద్దలు తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపినప్పుడు ఏం చేశావని కిరణ్‌ను ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు సీమాంధ్ర ప్రజలు తెలంగాణకు సానుకూలంగా లేమని చెప్పలేదే, ఓట్లు కూడా కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా పడలేదే? ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు సమైక్య రాష్ట్రాన్ని కోరుతున్నారంటూ కిరణ్‌ను కడిగిపారేశారు. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినప్పుడు రాని వ్యతిరేకత 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత రావడానికి సీమాంధ్ర నాయకులు కారణం కాదా అని కూడా నిలదీశారు. దీంతో ఠారెత్తిపోయిన కిరణ్ ఢిల్లీలో విమానమెక్కి హైదరాబాద్‌కు వచ్చేశాడు. అది మొదలు ప్రతి వేదికపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తడం ప్రారంభించాడు. అంతకుముందు అసెంబ్లీ నిండు సభలో తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని ఆవేశంతో రెచ్చిపోయాడు. రాగద్వేషాలకు అతీతంగా నడుచుకుంటానని చేసిన ప్రమాణాన్ని విస్మరించి తాను సీమాంధ్ర పక్షపాతినని చాటుకున్నాడు. ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా ప్రవర్తించాడు. కనీసం మంత్రి కూడా కాని కిరణ్‌ను కాంగ్రెస్ అధిష్టానమే ముఖ్యమంత్రిని చేసింది. 2009 ఎన్నికల్లో పీలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలవడానికి కిరణ్ పడిన అపసోపాలు అందరికి తెలిసనవే. అలాంటి వ్యక్తిని, ఒక్క ఎమ్మెల్యే కూడా వెనుక లేని కిరణ్‌కు కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తే అదే అధిష్టానంపై ప్రజల సమక్షంలో దుమ్మెత్తి పోశాడు. శాపనార్థాలు పెట్టాడు. ఇందిరాగాంధీ ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని సోనియాపై విమర్శలు గుప్పించాడు. ముఖ్యమంత్రిగా గద్దెనెక్కింది మొదలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు శాసనసభ, మండలి అభిప్రాయం కోసం వచ్చే వరకూ కిరణ్ వ్యవహారశైలి అధ్యంతం ప్రశ్నార్థకమే. తెలంగాణను అడ్డుకోవాలని కిరణ్ ప్రయత్నించడంలో ఆయన వ్యక్తిగత ఎజెండాతో పాటు సీమాంధ్ర పెత్తందారుల ప్రయోజనాలు దాగున్నాయి. తెలంగాణ ఏర్పడితే సీమాంధ్రులు అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు, కొళ్లగొట్టిన ఉద్యోగాలు వదిలి వెళ్లాల్సి వస్తుందనే సీఎం మొండిగా తెలంగాణకు అడ్డుతగులుతున్నాడు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతిని మాటిమాటికి కలుస్తూ తెలంగాణ బిల్లును త్వరగా కేంద్రానికి తిప్పి పంపొద్దని, ఇతరత్రా గొంతెమ్మ కోర్కెలు ఏకరువుపెడుతున్నాడు. తన రాజకీయ అవగాహన లేమిని నిస్సిగ్గుగా బయట పెట్టుకుంటున్నాడు. హైదారబాద్‌లో శీతాకాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతికి స్వాగతం పలకడం, మర్యాదపూర్వకంగా కలవడం సాధారణం. కానీ కిరణ్ తెలంగాణను అడ్డుకోవడమే ఎజెండాగా రాష్ట్రపతిని కలుస్తున్నట్లుగా తెలుస్తోంది. కిరణ్‌కు రాష్ట్రపతి ఎలాంటి అభయం ఇవ్వకపోయినా దింపుడుకల్లం ఆశతో చివరి ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజ్యాంగబద్ధమైన పదివిలో ఉన్న ముఖ్యమంత్రి, రాజ్యాంగ పరిరక్షకుడైన రాష్ట్రపతిని పదే పదే కలవడం రాజ్యాంగ విరుద్ధం. తాను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు సీఎం వివరణ ఇచ్చుకున్నా, ప్రథమ పౌరుడి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, ఆయన్ను భేటీల పేరుతో విసిగించడం సరికాదు.