దేవాలయ భూములు స్వాధీనం చేసుకోవాలి

వరంగల్‌,జనవరి16: తెలంగాణ ప్రాంతంలోని దేవాలయాల భూములు 12 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని వీటిని తక్షణం స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ వైష్ణవ అర్చక ఐకాస ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు ఎండోమెంట్‌ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు. దేవాదాయశాఖలోని కింది స్థాయి అధికారులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మక్కు కావడంతో భూములు అన్యాక్రాంతం అయ్యాయని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటే ఆలయాలు ఆర్థికంగా బలపడతాయని అన్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకుల వేతనం పెంచాలని కోరుతూ హైదరాబాద్‌లో దేవాదాయశాఖ కమిషనర్‌ ముక్తేశ్వర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో ధూప దీప నైవేద్య పథకం అమలవుతున్న దేవాలయాలు 3,200 ఉన్నాయని, ప్రస్తుతం వీటిలో పనిచేస్తున్న అర్చకులకు ప్రతినెల కేవలం రూ.2500 వేతనం మాత్రమే ప్రభుత్వం అందజేస్తోందన్నారు. భక్తుల ఆదరణ లేకపోవటం, పెరిగిన ధరల దృష్ట్యా వేతనం సరిపడక అర్చకులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. వేతనాన్ని రూ.4 వేలకు పెంచాలని కమిషనర్‌ను కోరారు. ఇందుకు కమిషనర్‌ సానుకూలంగా స్పందించి దానిని 4వేలకు పెంచేలా కృషి చేస్తానన్నారు. ప్రతి పెద్ద దేవాలయం నుంచి వసూలు చేస్తున్న కంట్రీబూషన్‌ను మూడు నుంచి నాలుగు శాతానికి పెంచితే అర్చకులకు రూ.4 వేల చొప్పున వేతనం చెల్లించవచ్చని సూచించారు. అర్చకుల వేతనాన్ని రూ.4 వేలకు పెంచేందుకు హావిూ ఇచ్చినట్లు ఆర్చక ఐకాస ప్రతినిధులు తెలిపారు. పీవీ నర్సింహారావు నుంచి నేడు శ్రీధర్‌బాబు వరకు సీమాంధ్ర పెత్తందార్ల కుట్రలు సాగుతూనే ఉన్నాయన్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహపై కూడా వివక్ష చూపారని, తెలంగాణ బిల్లు ఆపేందుకు సీఎంతో పాటు చంద్రబాబునాయుడి చర్యలను ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిపామన్నారు. ఈ నెల 19నకాజీపేటలోతెలంగాణ బ్రాహ్మణ ఐక్యతా సదస్సు జరుగనుందని, ఆ సదస్సుకు అర్చకులు, వైష్ణవులు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంతంపై సీమాంధ్రులు ఇంకెన్నాళ్లు వివక్ష చూపుతారని తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్‌ అధ్యక్షుడు గంగుఉపేంద్రశర్మ అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆలయాల అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్‌ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రాంతంలో 11,220 ఆలయాలుండగాకేవలం రూ. 220 కోట్లు మాత్రమే దేవాదాయ శాఖకు అందుతున్నట్లు తెలిపారు. అదే సీమాంధ్రలోని 16 ఆలయాల ద్వారా రూ. 50 వేల కోట్లఆదాయం వస్తుందన్నారు. తెలంగాణలోని ఆలయాల మనుగడ కోసం ప్రత్యేక ప్యాకేజి కింద రూ. వెయ్యి కోట్లు కేటాయించాలన్నారు. దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని, వాటిని ఆలయాలకు అందేలా చూడాలన్నారు. దూప, దీప, నైవేద్యం కోసం నెలకు రూ. 2,500 ఇస్తున్నారని, పెరిగిన నిత్యావసర ధరలతో అవి ఏ మాత్రం సరిపోవట్లేదన్నారు. ఈ మొత్తాన్ని రూ.4 వేల చొప్పున పెంచాలని ఆయన కోరారు.

తాజావార్తలు