విహారంలో విషాదం

అండమాన్‌లో పడవి మునిగి 21 మంది మృతి
పోర్టుబ్లేయర్‌, జనవరి 26 (జనంసాక్షి) :
విహారయాత్ర పెను విషాదాన్ని మిగిల్చింది. పోర్టుబ్లేయర్‌కు సమీపంలో అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో బంగాళాఖాతంలో ఆదివారం టూరిస్ట్‌ బోటు బోల్తా పడటంతో 21 మంది మరణించారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. తమిళనాడులో కాంచీపురం జిల్లాకు చెందిన అలాగే ముంబయి నుంచి వచ్చిన పర్యాటకులు, సిబ్బందితో కలుపుకొని మొత్తంగా 45 మంది ప్రయాణికులతో రాస్‌ ఐల్యాండ్‌ నుంచి నార్త్‌ బేకు వెళుతున్న బోటు మార్గమధ్యంలో బోల్తా కొట్టింది. ప్రమాదంలో 21 మంది మరణించగా, 13 మంది ప్రయాణికులను కాపాడడం జరిగిందని దక్షిణ అండమాన్‌ జిల్లా యంత్రాంగం నిర్ధారించింది. మిగిలిన ప్రయాణికులను కాపాడడం కోసం పౌర యంత్రాంగం, తీర ప్రాంత గస్తీ దళం లాంటి రక్షణ ఏజెన్సీలు గాలింపు చర్యలు చేపట్టాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సహాయక, పునరావాస కార్యకలాపాల్లో సహకరించాలని అన్ని కేంద్ర ఏజెన్సీలను ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆదేశించారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ”ఆక్వా మెరైన్‌” అని పిలిచే ఆ బోటు క్యాబిన్‌లో కొందరు చిక్కుకొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బోటు సామర్ధ్యం 25 మంది ప్రయాణికులు కాగా అంతకుమించిన ప్రయాణికులతో అదది కిటకిటలాడిపోవడం ప్రమాదానికి దారి తీసిందని వారు తెలిపారు. తమిళనాడులో కాంచీపురం జిల్లా నుంచి వచ్చి దక్షిణ అండమాన్‌ జిల్లాలోని ప్రోత్రపూర్‌ వద్ద ఒక రిసార్టులో బస చేసిన పర్యాటకులు, ముంబయి నుంచి మరో పర్యాటకుల బృందం బోటులో ఉన్నారని వెల్లడించారు. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ఎ.కె.సింగ్‌ మరణించిన వారి కుటుంబాలకు లక్షరూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కేంద్ర ¬మ్‌ మంత్రి సుశీల్‌కుమార్‌షిండేతో మాట్లాడిన సింగ్‌ ప్రమాదం తర్వాత చేపట్టిన సహాయకచర్యల గురించి షిండేకు వివరించారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని పోర్ట్‌బ్లెయిర్‌లోని జి.బి.పంత్‌ ఆస్పత్రిలో చేర్చారు. మృతదేహాలను పోస్ట్‌ మార్టం నిమిత్తం అదే ఆస్పత్రికి తరలించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారు. ప్రమాదంపై న్యాయ విచారణకు దక్షిణ అండమాన్‌ అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ ఆదేశించారు.