సీఆర్‌ రావు, సచిన్‌కు భారతరత్న బహూకరణ


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (జనంసాక్షి) :
ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త సీఎన్‌ఆర్‌ రావు, క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండుల్కర్‌కు మంగళవారం భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం భారతరత్న పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. క్రీడారంగంలో సచిన్‌ టెండూల్కర్‌, రసాయన శాస్త్రంలో సీఎన్‌ఆర్‌ రావులు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల విూదుగా భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. ముందుగా సీఎన్‌ఆర్‌ రావుకు పురస్కారాన్ని ప్రణబ్‌ అందచేశారు. తరవాత సచిన్‌కు భారతరత్న అందించారు. రసాయన శాస్త్రంలో కృషికి గాను రావుకు భారతరత్నను ప్రకటించారు. అలాగే క్రీడారంగంలో సచిన్‌కు భారతరత్నం అందించారు. ఇప్పటి వరకు భారతరత్న అందుకున్న వారిలో సచిన్‌ అత్యంత పిన్నవయస్కుడు కావడం విశేషం. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ ఛైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ, కేంద్రమంత్రులు ఆంటోని, ఆజాద్‌, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. సాదాసీదాగా జరిగిన ఈ కార్యక్రమం ఐదు నిముషాల్లో ముగిసింది.