విలీనమా? పొత్తా?

ద్వితీయ శ్రేణులతో కేసీఆర్‌ కసరత్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను ఆ పార్టీలో విలీనం చేస్తానన్న మాటను నిలబెట్టుకోవాలా? లేదా ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా అనే అంశంపై టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ తమ పార్టీ నాయకులతో కసరత్‌ షురూ చేశారు. మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం వెంకటాపుర్‌లోని తన ఫాంహౌస్‌లో గురువారం పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. శనివారం జరిగే తెరాస పొలిట్‌ బ్యూరో సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై వారు సమాలోచన జరుపుతున్నట్లు సమాచారం. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అలాగే కాంగ్రెస్‌లో విలీనంపై వస్తున్న ఒత్తిడిపై పార్టీ నేతలతో కెసిఆర్‌ చర్చించినట్లు సమాచారం. అయితే ఎక్కువమంది నాయకులు విలీనాన్నా వ్యతిరేకిస్తున్నారు. విలీనం అయితే పార్టీ ఐడెంటిటీ పోతుందన్న భయం వీరిని వెన్నాడుతోంది. దీంతో విలీనం కన్నా కాంగ్రెస్‌తో అవగాహన చేసుకుని ముందుకు వెళల్డమే బెటరని సూచించారని సమాచారం. ఇదిలావుంటే ఒకవేళ టిఆర్‌ఎస్‌ విలీనం వల్ల కాంగ్రెస్‌లో కెసిఆర్‌ ప్రాధాన్యం పెరిగితే ఎలా అన్నది కూడా కాంగ్రెస్‌ సీనియర్లు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. వీరు కూడా విలీనంకన్నా అవగాహనకే మొగ్గు చూపుతున్నారు. ఇదే విసయాన్ని కాంగ్రెస్‌ అధిష్టానం ముందుకు తీసుకుని వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకే విలీనంపై కెసిఆర్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తీరుతో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులందరి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పార్లమెంటు ఉభయసభలలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తరువాత టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌కు తెలంగాణ ప్రజలలోనే కాకుండా కాంగ్రెస్‌లో కూడా ప్రాధాన్యత పెరిగిపోయింది. సోనియా కూడా కెసిఆర్కు ప్రత్యేక గుర్తింపును ఇస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ్యాల్లో కూడా కెసిర్‌కు అదే ప్రాధాన్యత ఇస్తే తమ రాజకీయ భవిష్యత్‌ ఏమిటని తెలంగాణలోని సీనియర్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలోచనలో పడ్డారు. అప్పుడు తామంతా కెసిఆర్‌ కనుసన్నల్లో ఉండాల్సి వస్తుందని అంటున్నారు. అలాగే కెటిఆర్‌, హరీష్‌రావు, కవిత అనుచరులకు ప్రాధాన్య పెరుగుతుంది. వారికి టిక్కెట్లు కూడా దక్కే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులలో మన భవిష్యత్‌ ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు. ఇంతకాలం పార్టీని నమ్ముకున్నవారికి మొడి చేయిచూపిస్తారన్న భయం వారిని వెంటాడుతోంది.వారిని కలవరపరిచే మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, చాలా మంది కాంగ్రెస్‌ నేతలు ఏదోఒక సందర్భంలో కెసిఆర్‌ను తీవ్రంగా విమర్శించినవారే. వరంగల్‌ జిల్లా ఎంపి రాజయ్య టిఆర్‌ఎస్‌లో చేరతానని చెప్పి చేరలేదు. మరో ఎంపి పొన్నం ప్రభాకర్‌ కెసిఆర్‌ను తీవ్రస్థాయిలో విమర్శించారు. కెసిఆర్‌తో పాటు ఆయన కొడుకు కెటిఆర్‌, కూతురు కవిత, మేనల్లుడు హరీష్‌ రావులే కాకుండా ఆ పార్టీ ముఖ్యులు ఎంపి, ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం పోటీపడతారు. ఆ పోటీలో కెసిఆర్‌ మాటే చెల్లుబాటు అవుతుంది. తన మాట నెగ్గించుకోవడంలో ఆయన ముందుంటారు. అందులో సందేహం ఏమీలేదు. మరోరెండు రోజులు గడిస్తేగాని ఈ విషయంపై ఒక స్సష్టత వచ్చే అవకాశంలేదు. ఒకవేళ కెసిఆర్‌ టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసి, తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి తీసుకుంటే తెలంగాణ రాజకీయాలు మొత్తం అతని చుట్టూనే తిరుగుతాయి. అతని అనుచరులకు, అతనిని నమ్ముకున్నవాళ్లకే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం దక్కుతుంది. అందుకే కాంగ్రెస్‌లోని కెసిఆర్‌ వ్యతిరేకులు ఇప్పుడు తమకు టిక్కెట్‌ రాదని భయపడుతున్నారు. కెసిఆర్‌ అవన్నీ మనసులో పెట్టుకొని తమకు టిక్కెట్లు రాకుండా చేస్తారని భయపడుతున్నారు. వివిధ కారణాల వల్ల మధుయాష్కి, రాజయ్య, పొన్నం ప్రభాకర్‌, దానం నాగేందర్‌, డికె అరుణ, పొన్నాల లక్ష్మయ్యలకు ఈ సారి టిక్కట్లు దక్కే అవకాశం తక్కువ అని అంటున్నారు. అంతేకాకుండా తెలంగాణలోని ప్రతి జిల్లాలో కెసిఆర్‌ పట్టుపట్టి తన వారికి 50 శాతం టిక్కెట్లు ఇప్పించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. దాంతో ఎవరికి టిక్కెట్‌ వస్తుందో, ఎవరికి రాదో అని వారు భయపడుతున్నారు. వారు తమ చిరకాల వాంఛ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని ఒక పక్క ఆనందపడుతున్నా, మరో పక్క వారిని టిక్కెట్ల భయం వెంటాడుతోంది. ఈ దశలో విలీనాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అలాగని టిఆర్‌ఎస్‌ను దూరం పెట్టకుండా కాంగ్రెస్‌తో అవగాహనకు వచ్చేలా చేయాలని చూస్తున్నారు. మొత్తంగా అటు టిఆర్‌ఎస్‌, ఇటు కాంగ్రెస్‌ నేతలు విలీనంపై మల్లగుల్లాలు పడుతన్నారు.