తీరం వెంట అప్రమత్తత


ప్రధాని మన్మోహన్‌సింగ్‌
నేటిటా, మార్చి 4 (జనంసాక్షి) :
సముద్ర తీరం వెంట అప్రమత్తంగా ఉండాలని, సముద్ర తీర ప్రాంతాల్లో భద్రత కొరవడడంతో తీవ్రవాద సమస్యలు వస్తున్నాయని ప్రధాని మన్మోహన్‌ అన్నారు. తీరప్రాంత గస్తీని పెంచితేనే సమస్యకు పరిష్కరాం లభించగలదన్నారు. మయన్మార్‌లోని నేపిటా నగరంలో బీఐఎంఎస్‌టీఈసీ (బంగాళాఖాత తీర దేశాలు వివిధ రంగాల్లో సాంకేతికంగా, ఆర్థికంగా పరస్పరం సహకరించుకునే అంశంపై ఏర్పాటైన ఏడు దేశాల బృందం) సదస్సు మంగళవారం ప్రారంభమైంది. భారత ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ సహా ఏడు సభ్య దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. తీవ్రవాదాన్ని అరికట్టడానికి సభ్య దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ప్రధాని పేర్కొన్నారు. ఈ సదస్సులో భారత్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌, థాయిలాండ్‌, శ్రీలంక సభ్యులుగా ఉన్నాయి. తీవ్రవాదం, ఆర్థిక నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా తదితర సమస్యలను అరికట్టే విషయమై విస్తృత చర్చలు జరిపారు. రవాణా, వాణిజ్యం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల్లో సభ్యత్వ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. ఈ సదస్సులో మన్మోహన్‌సింగ్‌ మాట్లాడుతూ సభ్య దేశాల్లో తీవ్రవాదం, ఆర్థిక నేరాలు పెరగడానికి సముద్రతీరాల్లో గస్తే లేకపోవడమేనన్నారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థ మరింత బలపడాలని సూచించారు. మయన్మార్‌లో జరుగుతున్న ఏడు దేశాల సదస్సు నేపథ్యంలో భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సేతో మంగళవారం సమావేశమయ్యారు. 25 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో శ్రీలంక అరెస్టు చేసిన భారత మత్స్యకారుల గురించి, శ్రీలంకలోని సింహళ, తమిళుల సమస్యల గురించి ఇరువురు నేతలూ చర్చించారు.