ఇక ఓటరు కార్డు ‘స్మార్ట్’
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్
హైదరాబాద్, మార్చి 5 (జనంసాక్షి) :
ఓటర్లకు ఇక స్మార్ట్ గుర్తింపు కార్డులు (ఎపిక్) జారీ చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్న 76 లక్షల మంది ఓటర్లకు స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని భన్వర్‌లాల్ ప్రకటించారు. అలాగే పాత ఓటర్లు కూడా 25 రూపాయాలు చెల్లించి మీ సేవ కేంద్రంలో స్మార్ట్ కార్డు పొందవచ్చన్నారు. రాజకీయ పార్టీలతో భన్వర్‌లాల్ నిర్వహించిన సమావేశం ముగిసన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్‌కు ముందు రెండు రోజుల ముందే ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ స్లిప్‌ల పంపిణీ నోడల్ అధికారులు చేస్తారని చెప్పారు. ఎస్‌ఎంఎస్, వెబ్‌సైట్ ద్వారా ఓటరు జాబితాలో పేరు ఉందా లేదా సరి చూసుకోవాలన్నారు. ఓటరు నమోదు చేసుకునేందుకు మార్చి 9 వరకు చివరి అవకాశం ఉందన్నారు. ఆరోజు అన్ని పోలింగ్ బూతుల వద్ద నమోదుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఓటరు స్లిప్‌లో అన్ని వివరాలు పొందు పరుస్తామన్నారు. పాత ఓటర్లు కూడా రూ. 25 చెల్లించి ఈ సేవా కేంద్రాల్లో స్మార్ట్ కార్డులు పొందవచ్చన్నారు. అధునికతతో కూడిన ఈవీఎంలను ఈసారి ఎన్నికల్లో వినియోగిస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో నిలుచునే అభ్యర్థులు అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పులు, కేసులు సహా అన్ని వివరాలు ఇవ్వాల్సిందేనన్నారు. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వ్యయం రూ. 28 లక్షలుగా ప్రకటించారు. 69,014 పోలింగ్ కేంద్రాల్లో అత్యవసర, కనీస సదుపాయాలు కల్పిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీలు అభ్యంతరాలు తెలిపాయని పేర్కొన్నారు. పార్టీల అభ్యర్థనను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు.