స్థానిక ఎన్నికల జాప్యంపై సుప్రీం ఆగ్రహం
రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశం
సోమవారం నోటిఫికేషన్ విడుదలకు అధికారుల కసరత్తు
న్యూఢిల్లీ, హైదరాబాద్, మార్చి 7 : రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ జాప్యంపై సుప్రీంకోర్డు మండిపడింది. రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయకపోతే కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. 2013 ఫిబ్రవరి 18న తాము వెంటనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినా ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని సుప్రీం ప్రశ్నించింది. ( ఆ సమయంలో ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్న విషయం విదితమే.) మున్సిపల్, సాధారణ ఎన్నికల నిర్వహణలో ఉన్నందునా తమకు జూన్ 30 వరకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంను కోరారు. అయితే రిజర్వేషన్ల ఖరారులో జాప్యం జరిగినందువల్లే ఎన్నికలు నిర్వహించలేకపోయామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తలచుకుంటే 24 గంటల్లో రిజర్వేషన్లను నిరర్ణయించవ్చని, దాని కారణంగా చూపెట్టడం సరికాదన్నారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ ను విడుదల చేయాలని ఆదేశించింది. మళ్లీ సోమవారం నాడు ఈ కేసును పరిశీలిస్తామని, అప్పటి వరకు నోటిఫికేషన్ రాకుంటే కోర్టు ధిక్కరణగానే పరిగణిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆగమేఘాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. కోర్టు తీర్పు వెలువడగానే ఎన్నికల కమిషన్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థలకు కాలపరిమితి ముగిసి మూడేళ్లు గడిచినా ఇంత వరకు ఎన్నికలను నిర్వహించకపోవడాన్ని సుప్రీంకోర్టు సీరియస్‌గా పరిగణించడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగానే స్పందించింది. సమావేశమైన అధికారులు సోమవారం నాడు నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో నిమగ్నమైంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను ఖరారు చేసినా అధికారులు దానిని వెల్లడించలేదు. దీంతో హుటాహుటిన రిజర్వేషన్ల ఫైలును దుమ్ముదులుపుతున్నారు. సోమవారం నాటికి కచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.