టీటీడీ సిబ్బంది తీరుపై ఫిర్యాదు చేస్తా మాజీ ఎమ్మెల్యే జయసుధ

హైదరాబాద్‌, మార్చి 7  :తిరుమలలో జరుగుతున్న వివక్షపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు సినీ నటి, సికింద్రాబాద్‌ మాజీ ఎమ్మెల్యే జయసుధ అన్నారు. టిటీడీ సిబ్బంది భక్తుల పట్ల కనబరుస్తున్న వివక్షను గవర్నర్‌ నరసింహన్‌ దృష్టికి తీసుకెళ్ల నున్నట్టు చెప్పారు. శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో టీటీడీ సిబ్బంది ఒత్తిడి వల్లే తాను డిక్లరేషన్‌పై తాను సంతకం చేసినట్టు స్పష్టం చేశారు. ఇటీవల జయసుధ తిరుపతికి వెళ్లినప్పుడు ఆమెను డిక్లరేషన్‌పై సంతకం చేయాలని టీటీడీ సిబ్బంది ఒత్తిడి చేయలేదని ఇవో చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. టీటీడీ కార్యాలయం ఎక్కడ ఉన్నదో కూడా తనకు తెలియదని, తనంతట తానుగా వెళ్లి ఎందుకు సంతకం చేస్తానని ఆమె ప్రశ్నించారు. తనపై అనుమానం వచ్చేందుకు తాను ఉగ్రవాదినా అని ఆమె ఎదురు ప్రశ్నించారు. తాను తప్ప తన కుటుంబ సభ్యులంతా హిందువులేనని ఆమె స్పష్టం చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌ నుండి కూడా డిక్లరేషన్‌ను తీసుకుంటామన్న టీటీడీ సిబ్బంది ఆయన నుండి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. జగన్‌కో రూలు.. తనకొక రూలా అంటూ ఆమె నిలదీశారు. దీనిపై తాను గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు.