ఒకరి తల నరికి మరొకరికి కిరీటం పెడతారా?
జేఏసీ నేతలకు టికెటివ్వాల్సిందే
మైనార్టీలకు ఇచ్చిన చోట కాదు
నేను ప్రజలతో ఉన్న
శ్రీనివాస్‌గౌడ్‌కే ఎమ్మెల్సీ ఇవ్వండి.. వేరే చోట అవకాశ్వమివ్వండి
నన్ను బలి ఇవ్వడం సబబుకాదు
టీఆర్‌ఎస్ నాయకుడు ఇబ్రహీం
హైదరాబాద్, మార్చి 11 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి, అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి నేతలకు టీఆర్‌ఎస్ ప్రాధాన్యమివ్వాల్సిందేనని, అయితే తనలాంటి మైనార్టీ నేత ఇన్‌చార్జిగా చోట మాత్రం కాదని ఆ పార్టీ నాయకుడు మహ్మద్ ఇబ్రహీం అన్నారు. 2009 నుంచి మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న తనను తప్పించి, టీ జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్‌ను ఇన్‌చార్జిగా ప్రకటించిన సందర్భంగా ఆయన ‘జనంసాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. 2009 ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమి చెందిన తాను 2012 ఉప ఎన్నికల్లోనూ అలాంటి పరాజయాన్నే ఎదుర్కొన్నానని గుర్తు చేశారు. రెండు పర్యాయాలు స్వల్ప ఓట్లతో ఓడిపోయినా నిత్యం ప్రజలే మధ్యే ఉంటూ టీఆర్‌ఎస్ పార్టీ బలోపేతం కోసం సర్వం త్యాగం చేశానన్నారు. పార్టీని గ్రామ గ్రామానికి తీసుకెళ్లేందుకు తన సర్వస్వం ఖర్చు చేశానని చెప్పారు. రెండు పర్యాయాలు తాను ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిపోవడానికి కారణాలేమిటో పార్టీ అధినేత కేసీఆర్ సహా ముఖ్యులందరికీ తెలుసునన్నారు. తెలంగాణ కల సాకారమైన నేపథ్యంలో ఉద్యమంలో కలిసి వచ్చిన అన్ని పక్షాలకూ టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకు తాను సానుకూలమేనని తెలిపారు. అయితే టీఆర్‌ఎస్ 2009 ఎన్నికల్లో ఇచ్చిన ఏకైక మైనార్టీ సీటు ఇదని గుర్తు చేశారు. 2009లో మహబూబ్‌నగర్ ఎంపీగా కేసీఆర్ గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేసి తాను ఓడిపోయానని, ఈ విషయం అందరికీ తెలుసన్నారు. కేసీఆర్ సాధించిన 15 వేల ఓట్ల మెజార్టీ వెనుక తన శ్రమ ఎంత ఉందో అందరికీ తెలుసన్నారు. శ్రీనివాస్‌గౌడ్‌ను నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించే పేరుతో తనకు శాసన మండలి సీటు ఇవ్వజూపడాన్ని ఇబ్రహీం తప్పుబట్టారు. ఉద్యోగ సంఘాల నాయకులకు ప్రజాబలం ఉండదని, అలాంటి వారినే మండలికి పంపితే మంచిదని అన్నారు. రెండు పర్యాయాలు ఒడిన తనపై నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి ఉందని, తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి ఆ ఊపులో ఇట్టే గెలిచే సీటును శ్రీనివాస్‌గౌడ్‌కు ఇచ్చి కొత్త ప్రయోగానికి తెరతీశారన్నారు. మైనార్టీ నాయకుడిగా తనకు కొన్ని ప్రతిబంధకాలున్నాయని, మరో నియోజకవర్గానికి మారి తాను గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గ ప్రజలు తనను అర్థం చేసుకున్నారని, అందరూ తనను ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ సీటు తనకే ఇవ్వాలని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులతో పాటు పలువురు ముఖ్యులకు ఉన్నా అధినేత అందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఐదేళ్లుగా పార్టీ జెండా మోస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన తనకు మాట మాత్రమైనా చెప్పకుండా నియోజకవర్గ ఇన్‌చార్జి స్థానం నుంచి తప్పించడం అన్యాయమన్నారు. మునిసిపల్ ఎన్నికల వేళ పార్టీనే నమ్ముకున్న నాయకులు, కార్యకర్తల బతుకులు ఇన్‌చార్జి మార్పు వల్ల తలకిందులయ్యే అవకాశాలున్నాయని అన్నారు. తానే కాదు తన కార్యకర్తల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఉద్యమ పార్టీని నమ్ముకొని తెలంగాణ సాధనే ధ్యేయంగా పనిచేసిన తమకు పార్టీ అధినాయకత్వం ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పార్టీనే నమ్ముకునే పనిచేస్తే పార్టీ ఇచ్చే కానుక ఇదా అని ఆందోళన వ్యక్తం చేశారు. తనను ఇన్‌చార్జిగా తప్పించడంపై కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారని, ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడినా తాను వారించానని చెప్పారు. సొంత నియోజకవర్గంలో తనకు నష్టం కలిగిస్తే 119 నియోజకవర్గాల్లోని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. తాను పార్టీకి బద్ధుడినని, కానీ తనను తప్పించడం వల్ల తెలంగాణ వ్యాప్తంగా పార్టీపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని అన్నారు. యావత్ ముస్లిం సమాజం ఇది తమకు జరిగిన అన్యాయంగా తీసుకునే అవకాశం ఉందని, అది టీఆర్‌ఎస్‌కు నష్టం చేకూర్చవచ్చని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా తనను మార్చవద్దని కోరుతున్నానని తెలిపారు. తనకు పార్టీ అధినేత కేసీఆర్‌పై నమ్మకముందని, ఆయన నిర్ణయంపై పున: సమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తానొక్కడి వల్ల తెలంగాణ వ్యాప్తంగా ప్రతికూలత ఎదురయ్యే విషయాన్ని గుర్తించాలన్నారు. శ్రీనివాస్‌గౌడ్‌కే ఎమ్మెల్సీగా అవకాశమివ్వాలని లేదా వేరే నియోజకవర్గం నుంచి శాసన సభకు పంపాలని కోరారు. ఒకరికి కిరీటం పెట్టడానికి ఇంకొకరి తల నరకడం మంచిది కాదని, ఆ విషయాన్ని పార్టీ అధినాయకత్వం గుర్తించాలని అన్నారు.