బీసీ రిజర్వుడు స్థానాల్లో ముస్లింలు పోటీ చేయొచ్చు

హైదరాబాద్‌, మార్చి 12 (జనంసాక్షి) :

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వు చేసిన స్థానాల్లో ముస్లింలు (బీసీ-ఈ) పోటీ చేయవచ్చు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం 2007లో ఉత్తర్వులు జారీ చేయగా, బీసీ-ఈలో రిజర్వేషన్‌ పొందుతున్న కులాలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాష్ట్ర ఎన్నికల సంఘం 2009లోనే కల్పించింది. ఈమేరకు జీవో నం.504ను జారీ చేసింది. దానికి కొనసాగింపుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తాజాగా మరో జీవో జారీ చేసింది. బీసీ రిజర్వుడు స్థానాల్లో బీసీ-ఈ గ్రూపులోని ముస్లింలు పోటీ చేయవచ్చని పేర్కొంది. ఈమేరకు మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి మంగళవారం మెమో నం. 5249/ఎలక్షన్స్‌/2014ను జారీ చేశారు. బీసీ రిజర్వుడు స్థానాల్లో బీసీ-ఈ కేటగిరిలోని కులాలకు చెందిన వారు పోటీ చేయడానికి అర్హులా కాదా? అన్న అంశంపై వివరణ ఇవ్వాలని డైరెక్టర్‌ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. బీసీ సంక్షేమ శాఖ గుర్తించిన బీసీ జాబితాలోని ముస్లింలంతా బీసీల జాబితాలోకే వస్తారని సమీర్‌శర్మ ఉత్తర్వులు వెలువరించారు. తాజా ఉత్తర్వులతో అచ్చుకండ్లవాళ్లు, అత్తరుసాయబులు/అత్తరోళ్లు, దోబీ ముస్లిం, పకీర్‌, గారడీముస్లిం, గోసంగి ముస్లిం/పకీర్‌ సాయబులు, ఎలుగుబంటువాళ్లు, హాజం, లబ్బి, పకీర్ల, ఖురేషి, షేక్‌, సిద్ధి, తురుక కాషా కులాల వారు బీసీ రిజర్వుడు స్థానాల్లో పోటీ చేయవచ్చని సూచించారు. మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లోని బీసీ రిజర్వుడు స్థానాల నుంచి వీరి పోటీపై తాజా ఉత్తర్వుల ద్వారా అపోహలు తొలగిపోయాయి. ఈ జీవో పూర్తి వివరాల కోసం జనంసాక్షి వెబ్‌సైట్‌ షషష.యaఅaఎఝసరష్ట్రఱ.శీతీస్త్రను సందర్శించవచ్చు.