దేవయాని గెలిచింది


వీసా అక్రమాల కేసు కొట్టివేత
న్యూఢిల్లీ, మార్చి 13 (జనంసాక్షి) :
వీసా అక్రమాలకు సంబంధించిన కేసులో భారత దౌత్యాధికారి దేవయాని ఖోబ్రగాడెకు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ కేసులోనే గత డిసెంబరులో అమెరికా అధికారులు దేవయానిని అరెస్టు చేసి సంకెళ్లు వేసి తీసుకెళ్లారని, విచారణ సమయంలో నేరస్తులతో పాటు ఒకే గదిలో ఉంచారని వార్తలు వచ్చాయి. భారత్‌ ఈ అంశంపై వెంటనే స్పందించి తదనుగుణమైన చర్యలు తీసుకుంది. అయితే ఈ కేసును విచారించిన న్యాయస్థానం దౌత్యవేత్తగా ఆమెకు అన్ని రకాల రక్షణలు ఉంటాయని, భవిష్యతులోనూ ఆమెపై ఎలాంటి అభియోగాలు నమోదు చెయ్యవద్దని చెప్పింది. భారత దౌత్యవేత్త దేవయాని కోబ్రాగేడ్‌ పైన వీసా మోసం కేసులో అభియోగాలను అమెరికాలోని స్థానిక కోర్టు కొట్టేసింది. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌ అధికారిగా ఉన్న సమయంలో దేవయాని తన ఇంట్లో పని మనిషికి సంబంధించిన వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతేడాది డిసెంబర్‌ 12న కేసు నమోదైన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాల్లో ఆమెను అమెరికా తమ దేశం నుంచి బహిష్కరించించింది. ఈ కేసులో దేవయానిపై జనవరిలో అభియోగాలను నమోదు చేశారు. అయితే, అదే నెల 8వ తేదీన దేవయానికి పూర్తి దౌత్యరక్షణను మంజూరు చేసినందున ఆమెపై కేసును కొట్టివేస్తున్నట్లు జడ్జి పేర్కొన్నారు. అరెస్టు సమయంలో దౌత్య రక్షణ కలిగి ఉన్నందున ఆమెపై అభియోగాలను కొట్టివేయక తప్పడం లేదని న్యాయమూర్తి చెప్పారు. కాగా, గత ఏడాది దేవయాని ఉదంతం అమెరికా, భారత్‌ మధ్య వేడి రాజేసిన విషయం తెలిసిందే. పని మనిషి విషయంలో దేవయానిని అమెరికా పోలీసులు అరెస్టు చేసి, దుస్తులు విప్పించి చెక్‌ చేయడం వివాదానికి దారి తీసింది