రెండు రాష్ట్రాలకూ ఒకే సచివాలయం

బ్లాక్‌లను విడగొట్టిన అధికారులు

హైదరాబాద్‌, మార్చి 20 (జనంసాక్షి) :

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే సచివాలయం ఉండబోతున్నట్లు విభజన పంపకాలు చూస్తున్న అధికారులు తెలిపా రు. ప్రస్తుత రాష్ట్ర సచివాలయాన్నే రెండు బ్లాకులుగా విడగొట్టి రెం డు రాష్ట్రాలకు పంపిణీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. రోడ్లు భవనా ల శాఖ అధికారులు ఈమేరకు బ్లాకుల కేటాయింపులో పంపకాల అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. రెండు రాష్ట్రాల సచివాలయాల మధ్య ఎలాంటి అడ్డుగోడను కూడా నిర్మించబోమని అధికారులు పేర్కొన్నారు. అయితే రెండు రాష్ట్రాల సందర్శకులు సచివాల యంలోని ఇతర రాష్ట్రాల కార్యాలయాలలోకి వెళ్లకుండా నిరోధిం చడానికి ముందు జాగ్రత్తలు చేపడుతామన్నారు. భద్రతా పరమైన సమస్యలు తలెత్తకుండా కంచె ఏర్పాటు చేస్తామన్నారు. విభజన అనంతరం ఏపీ ముఖ్యమంత్రికి ఒక బ్లాకు, తెలంగాణ ముఖ్యమంత్రికి మరో బ్లాకును కేటాయిస్తామన్నారు. ఆ బ్లాకులో సీఎం కార్యాలయాలు, కేబినెట్‌ సమావేశ మందిరం, సాధారణ మీటింగ్‌ హాల్‌, తదితర అవసరాల కోసం వాటాలు చేస్తామని వెల్లడించారు. సి బ్లాకులో ఉన్న సీఎం కార్యాలయంలో అన్ని సదుపాయాలు ఉన్నందున దానిని తెలంగాణ ముఖ్యమంత్రికి కేటాయించే అవకాశముంది. అలాంటి సౌకర్యాలే మరో బ్లాకులోనూ కల్పించి ఏపీ సీఎంకు కేటాయిస్తామని వారు పేర్కొన్నారు. అయితే అధికారులు బ్లాకు కేటాయింపులోనూ వాస్తు ముద్ర ఉండేలా చూస్తున్నారు. ఏపీ సీఎం కోసం హెచ్‌ సౌత్‌ బ్లాక్‌ను కేటాయించే అవకాశాలున్నట్లు అధికారులు చెప్పారు. జూన్‌ 2వ తేదీ అపాయింటెడ్‌ డే కావడంతో అలోగా పంపకాలతో పాటు వేర్వేరు గేట్ల ఏర్పాట్లను పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.