ఆ శకలాలు విమానానివే కావొచ్చు : ఆస్ట్రేలియా


కౌలాలంపూర్‌, మార్చి 23 (జనంసాక్షి) :
దక్షిణ హిందూ మహాసముద్రంలో కనిపించిన శకలాలు మలేషియా విమానానివే కావొచ్చని ఆస్ట్రేలియా పేర్కొంది. మలేషియా విమానం కోసం సాగిస్తున్న పరిశోధనలో తమ దేశానికి చెందిన ఒక విమానం కొన్ని వస్తువులను గుర్తిం చిందని, కొయ్య పలకలాంటి వస్తువు, బెల్టులు, పట్టీలాంటి చిన్నా చితక వస్తువులు గుర్తించినట్లు చెప్పింది. ఉపగ్రహ చిత్రాలు కాకుండా ప్రత్యక్షంగా చూసిన చిత్ర ఇదే మొదటిదని తెలిపింది. విమాన అన్వేషణలో సహాయం చేస్తున్న పౌర విమానం ఒకటి శనివారం ఆ వస్తువులను గుర్తించినట్లు ఆస్ట్రేలియా వెల్లడించింది. ఆ ప్రాంతానికి నాలు గు మిలటరీ విమానాలను పంపి మరింత లోతు గా పరిశీలిస్తామని ఆస్ట్రేలియా అధికారులు తెలి పారు. ఆదివారం వాతావరణం బాగాలేదని, తమ అన్వేషణకు ఇది అడ్డంకిగా మారిందని వారు పేర్కొన్నారు. దక్షిణహిందూ మహాసముద్రంలో భారీ వస్తువులు తేలియాడుతున్నట్లు ఫ్రెంచి ఉపగ్రహం కూడా ఛాయా చిత్రలను విడుదల చేసింది. ఈ విషయాన్ని మలేషియా అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, చైనా ఉపగ్రహాలు ఛాయా చిత్రాలు విడుదల చేశాయని వాటి ఆధారంగా సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నామని తెలిపారు. తాజాగా ఇదే ప్రాంతంలో భారీ వస్తువులు తేలుతున్నట్లు ఫ్రెంచి ఉపగ్రహం కూడా గుర్తించడంతో అదే ప్రాంతంలో విమానం కూలినట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు.