రామభక్తులకు అన్నదానం చేస్తున్న శంఖుబాబు
ఖమ్మం, ఏప్రిల్ 5 : జిల్లాలోని కుకునూరు గ్రామ రైతు ఉడతాభక్తుల శంఖుబాబు. ఈ పేరు రామభక్తులకు పరిచయం అవసరంలేదు. పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంలో ప్రతిఏటా జరిగే సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు కుకునూరు గ్రామ రైతు శంఖుబాబు ఇచ్చే అతిథ్యం మరచిపోలేనిది. వేల సంఖ్యలో వచ్చే భక్తులకు కాదనకుండా భోజనం, వసతి సౌకర్యం కల్పించడం ఆయన ప్రత్యేకత. నవమికి నాలుగు రోజుల ముందే నుంచే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇందులో ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర నుంచి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. వీరందరి మార్గం కుకునూరు మీదుగానే వందల మైళ్ల దూరం నుంచి వచ్చే భక్తులు కాలినడకన భద్రాద్రికి చేరుకుంటారు. వీరందరికి మార్గ మధ్యంలో భోజనం, వసతి దొరకక అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ అవస్థలు గమనించిన శంఖుబాబు కుకునూరులో భక్తుల కోసం విడిది ఏర్పాట్లు చేశారు. విశాలమైన ప్రదేశంలో చలువ పందిళ్లు వేసి భోజనం, నిద్రించే ఏర్పాట్లు చేస్తున్నారు. 8 ఏళ్లుగా ఈ క్రతువు నిరంతరాయంగా జరుగుతుండటంతో రామభక్తులకు నిడిది అలవాటైంది. నవమికి నాలుగు రోజుల ముందు నుంచే రామభక్తుల రాక ఆరంభమవుతోంది. అప్పటి నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. విడిది గురించి రామభక్తులకు ముందే తెలుసుకనక ఈ ప్రాంతానికి రాగానే ఫోన్ ద్వారా ఎంత మంది వస్తున్నది తెలియజేస్తారు. ఆ ప్రకారం వారు ఇక్కడకు వచ్చే సరికి భోజనాలు తయారు చేసి ఉంచుతారు. ఒక్క పైసా కూడా ఆశించకుండా భక్తుల సేవలో పునీతమవుతున్న శంఖుబాబుకు స్థానిక వితరణశీలురులు తమ వంతుగా కొద్దోగొప్పో సహాయాన్ని అందజేస్తుంటారు.