నామినేషన్‌ దాఖలు చేసిన నరేంద్రనాథ్‌

సంగారెడ్డి, ఏప్రిల్‌ 4  : మెదక్‌ పార్లమెంట్‌కు బిజెపి అభ్యర్థి చాగండ్ల నరేంద్రనాథ్‌ శనివారం ఒకసెట్‌ నామినేషన్‌ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి, పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి స్మితా సబర్వాల్‌కు దాఖలు చేశారు. ఆయన కలెక్టర్‌ కార్యాలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, సామాజిక సేవారంగంలో కొనసాగుతున్న తనను గెలిపించాలని కోరారు. గత ఐదేళ్ళుగా జిల్లాలో నరేన్‌ ట్రస్టు స్థాపించి మహిళలకు కుట్టుమిషన్ల కేంద్రాల ఏర్పాటు, నిరుద్యోగ యువతకు కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాలు, ఆరోగ్య శిబిరాలు, పేదలకు సామూహిక ఉచిత వివాహాలు, మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థికసాయం, యువతకు క్రికెట్‌ కిట్ల పంపిణీ, డ్వాక్రా మహిళా సంఘాలకు బీరువాలు ఉచిత పంపిణీ, గ్రామాల్లో విద్యుద్దీపాల ఏర్పాటు వంటి కార్యక్రమాలు తాను చేపట్టినట్టు చెప్పారు. అవినీతిమయమైన కాంగ్రెస్‌ను పారదోలి దేశాన్ని కాపాడాలని అన్నారు. ప్రస్తుతం దేశంలో అభివృద్ధి చెందిన గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ప్రధాని అభ్యర్థి మోడీ నాయకత్వాన్ని బలపరిచి ప్రజలకు స్వచ్ఛమైన పాలనను బిజెపిని గెలిపించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన బిజెపిని మెదక్‌ ఎంపి స్థానాన్ని గెలిపించి మోడీకి కానుకగా అందించాలని అన్నారు. నరేంద్రనాథ్‌ కుటుంబ సభ్యులతో కలిసి తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈనెల 8 లేదా 9 తేదీల్లో మరో నామినేషన్‌ పత్రాన్ని పార్టీ కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా నామినేషన్‌ దాఖలు చేస్తానని చెప్పారు. తను కాంగ్రెస్‌కు సేవలు అందించినా ప్రజాక్షేత్రంలో తనను ఎదుర్కొనలేకనే ఎన్నికల కోడ్‌ కంటే ముందు పంపిణీ చేసిన వస్తువులను సీజ్‌చేసి తనపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుమ్మక్కై కేసులు నమోదు చేయిస్తున్నారని అన్నారు. కలెక్టర్‌కు వాస్తవ పరిస్థితులను వివరించానని అన్నారు. తన నామినేషన్‌ను ఎన్నికల అధికారి స్వీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.బుబ్బిరెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.