బీజేపీ – టీడీపీ మధ్య కుదిరిన పొత్తు

హైదరాబాద్ : టీడీపీ – బీజేపీల మధ్య పొత్తు అంశానికి ఎట్టకేలకు తెర పడింది. గత కొంత కాలంగా జరుగుతున్న చర్చలు ఇవాళ ఫలప్రదమయ్యాయి. చర్చలు ఫలించడంతో టీడీపీ – బీజేపీ నేతలు కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ – బీజేపీ మధ్య పొత్తు కుదిరిందని స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చారిత్రక నిర్ణయమని చెప్పారు. కొద్ది రోజులుగా పొత్తులపై అనేక చర్చలు జరిగాయన్నారు. అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌తో పొత్తులపై చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ – టీడీపీ కలిసి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 272 సీట్లు సాధించడమే తమ లక్ష్యమన్నారు.

దేశ ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు : బాబు
హైదరాబాద్ : దేశ ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. బీజేపీ – టీడీపీల మధ్య పొత్తు కుదిరిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడించడమే తమ లక్ష్యమన్నారు. అవినీతి, కుంభకోణాలతో దేశాన్ని కాంగ్రెస్ అస్తవ్యస్తం చేసిందని ధ్వజమెత్తారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రయోజనాల కోసమే తీసుకుంటానని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం కార్యకర్తలు సహకరించాలని కోరారు. సామాజిక తెలంగాణ కావాలన్నారు. సీమాంధ్రకు సరిగా ప్యాకేజీలు ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణలో 8 ఎంపీ, 47 అసెంబ్లీ స్థానాలు, ఏపీలో 15 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలను బీజేపీకి కేటాయించామని చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ, టీడీపీ కార్యకర్తలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.