మీరా మహిళలకు రక్షణ కల్పించేది?


కర్ణాటకలో మహిళలపై దాడులు
గుజరాత్‌లో అతివలపై నిఘా
భాజపాపై రాహుల్‌ ఫైర్‌
జైపూర్‌, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) :కర్ణాటకలో మహిళలపై దాడు లకు పాల్పడుతున్న వాళ్లు, గుజరాత్‌లో అతివలపై నిఘా పెడుతున్న వాళ్లు మహిళలకు రక్షణ కల్పిస్తామంటే ఎలా నమ్మాలని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బీజేపీ
నేతలను ప్రశ్నించారు. గురువారం రాజస్థాన్‌లోని ఝుంఝునులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కపలాకాసే చౌకీదారులు కూడా ఒక్కోసారి దొంగతనానికి పాల్పడుతారని పరోక్షంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై ఆరోపణలు గుప్పించారు. దేశానికి కాపలాదారుగా ఉంటానన్న మోడీ పట్ల అప్రమత్తంగా ఉండాలని, తాళాలను ఏ ఒక్కరి చేతుల్లోనో పెట్టడం తగదని ఆయన పేర్కొన్నారు. దేశానికి ఏ ఒక్కరో కాపలాదారుగా ఉండాలని ప్రజలు కోరుకోవడం లేదని, దేశానికి కోట్లాది మంది కాపాలదారులు ఉండాలని కాంగ్రెస్‌ కోరుకుంటోందని ఆయన చెప్పారు. అంటే దేశ భద్రతకు సంబంధించిన తాళాలు కోట్లాది మంది చేతుల్లో ఉండాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. అదే కాంగ్రెస్‌కు, బీజేపీకి మధ్య ఉన్న తేడానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను బీజేపీ కాపీ కొడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.