మోడీకి తలనొప్పి…

(జ‌నంసాక్షి):సార్వత్రిక సమరంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రస్ కు కొత్త అస్త్రం దొరికింది. నరేంద్రమోడీ  దాఖలు చేసిన అఫిడవిట్ లో.. తనకు పెళ్లైందని భార్యపేరు జశోదా బెన్ అని ప్రస్తావించడంపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 2012 నుంచి మోడీ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తున్నారని… మోడీపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రన్యాయశాఖా మంత్రి కపిల్ సిబల్ కోరారు.

సార్వత్రిక సమరంలో మోడీకి కొత్త తలనొప్పి మొదలైంది. అయితే.. దానికి కారణం.. విపక్షాలు కాదు.. తాను దాఖలు చేసిన అఫిడవిటే కావడం విశేషం. వడోదరలో నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో నరేంద్ర మోడీ.. తనకు పెళ్లైందని.. భార్య పేరు జశోదా బెన్ అని పేర్కొన్నారు. అయితే ఆమె ఆస్తుల సమాచారం మాత్రం తనకు తెలియదు అని పేర్కొన్నారు. దీంతో సరికొత్త వివాదం తెర మీదకు వచ్చింది.

నరేంద్రమోడీ అఫిడవిట్ ను అస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్.. మోడీపై యుద్ధానికి తెరతీసింది. కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర న్యాయ శాఖా మంత్రి కపిల్ సిబల్.. మోడీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 2012కు ముందు మోడీ దాఖలు చేసినవన్నీ తప్పుడు అఫిడవిట్లు అని..  వాటిలో పెళ్లైన విషయాన్ని చెప్పలేదని పేర్కొన్నారు. తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన మోడీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

మరోవైపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కూడా నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా సాధికారత అంటే మోడీకి గౌరవం లేదని.. అలా ఉంటే సొంత భార్య పేరు కూడా ఇన్నాళ్లూ చెప్పుకోకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. 2012కు ముందు సమర్పించిన అఫిడవిట్లలో భార్య పేరు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లు ఢిల్లీ పీఠం ఎక్కితే.. మహిళలకు రక్షణ లేకుండా పోతుందని విమర్శించారు.

కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు కూడా అదే స్థాయిలో ప్రతివిమర్శలు చేశారు. నరేంద్రమోడీ చిన్నప్పుడే బాల్యవివాహం చేసుకున్నారని.. అయినా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం మంచిది కాదని.. బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మోడీని ఎదుర్కోలేకే.. వ్యక్తిగత విమర్శలకు దిగుతుందన్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాలన గురించి కాకుండా.. వ్యక్తిగత విషయాలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

సార్వత్రిక సమరంలో అందరికంటే ముందంజలో ఉన్న నరేంద్రమోడీ..తనకు తెలియకుండానే.. తనపై ప్రయోగించేందుకు ప్రత్యర్థులకు అస్త్రాన్ని అందించారు. మరి కాంగ్రెస్ దీన్ని ఏ మేరకు క్యాష్ చేసుకుంటుందో.. బీజేపీ నేతలు కాంగ్రెస్ ను సమర్థంగా ఎదుర్కొంటారో అన్నది చూడాల్సిందే.