ప్రియురాలిని కలపలేదని వేధింపులు…

హైదరాబాద్ (జ‌నంసాక్షి) : తాను ప్రేమిస్తున్న అమ్మాయి తనను ప్రేమించేలా సహకరించలేదని కక్షగట్టి స్నేహితురాలిని ఫేస్బుక్ ద్వారా వేధిస్తున్న ఓ యువకుడిని సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం…కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన కె.బాలయ్యబాబు (30) నగర శివార్లలోని ఇంజనీరింగ్ కళావాలలో రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. చదువుకుంటున్న సమయంలో తన తోటి విద్యార్థినిని ప్రేమించాడు. అయితే ఆమె బాలయ్యబాబు ప్రేమను నిరాకరించింది. ప్రియురాలు తన ప్రేమను అంగీకరించేలా చేయాలని స్నేహితురాలైన మరో విద్యార్థినిని బాలు కోరాడు.
ఈ విషయంలో సహకరించకపోవడంతో ఆమెపై బాలు కక్ష పెంచుకున్నాడు. స్నేహితురాలికి ఇటీవల పెళ్లి జరిగింది. ఈ విషయం తెలిసిన…బాలు ఆమె ఫేస్బుక్ అకౌంట్కు అసభ్యకరమైన మెసేజ్లు పంపి వేధించటం మొదలుపెట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నగర సైబర్ క్రైమ్ ఠాణా ఇన్స్పెక్టర్ పి.రాజు నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా జైలు నుండి విడుదలయ్యాక తనను ప్రేమించని యువతిని కూడా ఇదేవిధంగా వేధిస్తానని నిందితుడు హెచ్చరించడం గమనార్హం.