మోడీ తెలంగాణ ద్రోహి
నరనరాన తెలంగాణ వ్యతిరేకత
నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్దరిస్తాం
అధికారంలోకి వచ్చేది మేమే : కేసీఆర్
నిజామాబాద్, ఏప్రిల్ 24 (జనంసాక్షి) :
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తెలంగాణ ద్రోహి అని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎన్నికల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుకు జైలు తప్పదని కేసీఆర పేర్కొన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని బొందపెట్టి అడ్డగోలుగా అమ్ముకున్నాడని ఆరోపించారు. కేబినేట్‌లో వ్యతిరేకించినా దానిని అమ్ముకున్నారని తెలిపారు. దానికి పునర్వైభవం కల్పిస్తామన్నారు. బోధన్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిట్టనిలువున అమ్ముకున్నదే చంద్రబాబేనన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేసి రిటైర్డ్ అయిన ఐఏఎస్ అధికారి ఫరేఖ్ ఈ మధ్యనే వెలువరించిన పుస్తకంలో బాబు బండారం అంతా బయటపెట్టిండు. అప్పట్లో ఆ అధికారి ఎంత చెప్పినా వినకుండా కనీసం కేబినెట్‌లో పెట్టకుండా సొంత నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి రూ. 380 కోట్లు నష్టం చేకూర్చాడు. నిజాం షుగర్స్‌ను ప్రభుత్వ పరం చేసి, ఆసియాలోనే పెద్ద ఫ్యాక్టరీగా మారుస్తామని కేసీఆర్ హావిూ ఇచ్చారు. జిల్లాకు సింగూరు జలాలు తీసుకువస్తామని ఆయన అన్నారు. టీడీపీ-బీజేపీ మాటలను నమ్మవద్దని, టీఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. ఇక మోడీ తెలంగాణ శత్రువని ప్రకటించారు. చంద్రబాబు సంకలో చొచ్చి తెలంగాణకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు వల్ల తల్లి చచ్చిందని మోడీ అనడం దుర్మార్గమన్నారు. నిజామాబాద్‌లో గురువారం ఆయన సుడిగాలి పరన్యటనతో అనేక సభల్లో ప్రసంగించారు. అంతటా ఆయన మోడీ, చంద్రబాబు, పవన్‌లపై మండిపడ్డారు. ఆంద్రా వాల్లంతా కలసి మోడీని అడ్డం పెట్టుకుని తెలంగాణపై పెత్తనానికి సిద్దం కావాలని చూస్తున్నారని అన్నారు. మోదీ తెలంగాణ దుష్మన్ అని, ఆయనకు స్కూ లూజు అయిందని, చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్టునే చదువుతున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణపై అవాకులు, చెవాకులు పేలితే ఊరుకునేది లేదని కేసీఆర్ హచ్చరించారు. మోదీ నరనరాన తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్నారని, బాబు పక్కన కూర్చుని మోదీ తెలంగాణ ద్రోహిగా ముద్రవేసుకున్నారని ఆయన విమర్శించారు. వీరిపట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. బాబు మోసాలపై ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో విచారణ జరిపించి జైలుకు పంపడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తమన్నారు. సీడ్ రిసెర్చ్ సెంటర్‌ను బోధన్‌లో ఏర్పాటుచేస్తమని ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాటం ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, ఈ సాధించుకున్న రాష్ట్రం ఎలా ఉండాలి, ఎవరి చేతిలో ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుందనేది మనం తెలంగాణ జాతిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణను ముంచింది టీడీపీ,కాంగ్రెస్ పార్టీలేనని ఆరోపించారు. ఒకపుడు బోధన్‌కు ఉన్న పూర్వ వైభవం తీసుకొస్తామని హామీనిచ్చారు. అన్యాక్రాంతమైన సింగూర్ జలాలను నిజామాబాద్‌కు తెస్తానని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో బోధన్‌లో చెరుకు పరిశోధనాకేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గులిపిస్తే మంచి జరుగుతుందని, తప్పుడు పార్టీలను ఎన్నుకుంటే తప్పుడు ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. బాగా ఆలోచించి తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకుని ఓటు వేయాలని కేసీఆర్ కోరారు. టీఆర్‌ఎస్ పార్టీ తన రాజకీయ మేనిఫెస్టోను పెట్టిందని, రైతులందరికీ లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని చెప్పామని, తప్పకుండా రుణ మాఫీ చేస్తామని కేసీఆర్ మరోసారి హావిూ ఇచ్చారు. రైతులు వ్యవసాయం కోసం వాడే ట్రాక్టర్లు, ట్రాలీలపై టాక్స్‌లు ఉండవని ఆయన స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రం ఎర్పడిన సందర్భంగా మొదటిసారి ఎన్నికలు వచ్చాయని, మన తలరాతను మనమే రాసుకోబోతున్నామని అన్నారు. ఈ ఎన్నికల్లో మనం మోసపోతే, తీవ్రంగా నష్టపోతామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బాల్కొండ నియోజకవర్గానికి లక్షా 50 వేల ఎకరాలకు నీరందిస్తానని తెలిపారు. నియోజక వర్గ పరిధిలోని మోతె గ్రామంలో పసుపు బోర్డు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేస్తానని హావిూనిచ్చారు. బీడీ కార్మికులకు ప్రతినెల వెయ్యి రూపాయలను ప్రభుత్వం తరపున అందించనున్నట్లు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. బాల్కొండలో జరిగిన ఆపార్టీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. బీడీ కార్మికుల బాధలు నాకు బాగా తెలుసు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరచలేదు. కానీ మీ కష్టాలు నాకు తెలుసు. వచ్చే టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో బీడీ కార్మికులకు ఇప్పటికే బీడీలు చుట్టి రిటైర్డ్ అయినవారికి ప్రతి నెల వెయ్యి రూపాయల పింఛను అందిచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన ప్రచారానికి భారీగా స్పందన వస్తోంది.
తెలంగాణ శత్రువులను వెనకేసుకుని వచ్చిన మోడీ ఏనాటికీ తెలంగాణ వ్యతిరేకే అవుతాడని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పని సంస్కారం మోడీదన్నారు. చంద్రబాబును సంకలేసుకుని ఆయన తెలంగాణపై అక్కసు గక్కాడన్నారు. చంద్రబాబు బొడ్లో కత్తి పెట్టుకుని తిరుగుతున్నాడని జాగ్రాత్త అని హెచ్చరించారు. అందరికీ ఇప్పుడు టార్గెట్ కేసీఆర్, టీఆర్‌ఎస్ అన్నారు. వీరందరి కబ్జాలు బయటపెడతామనే ఆంధ్రావాళ్లు ఏకమై వస్తున్నారని, వారందరికి సూపర్ రక్షకుడుగా మోడీ తయారయ్యాడన్నారు. ఆయన గొడుగు కింద వీరంతా తయారయ్యారని నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి సభలో కేసీఆర్ నిప్పులు చెరిగారు.వీరంతా కలసి తెలంగాణను ఇంతకాలం ఆడించారని, ఇప్పుడు తమగుప్పిటి నుంచి జారిపోతుందన్న భయం పట్టుకుందన్నారు. అందుకే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ 90 సీట్లకు పైగా గెల్చుకునే రిపోర్టులు ఉన్నాయని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఇప్పుడు తననే టార్గెట్ చేశారన్నారు. ఓ వైపు మోడీ, చంద్రబాబు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు, పవన్ కళ్యాణ్ తదితరలకు తానే టార్గెట్ అయ్యాన్నారు. అందుకే ఇంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలన్నారు. గతంలో ఎన్నో ఎన్నికలు వచ్చినయి.. పోయినయి.. ఇవి ఆషామాషీ ఎన్నికలు కావని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని ఈ సారి పొరపాటు చేస్తే మళ్లీ తిరిగి రిపేర్ చేయలేమని అన్నారు. ఇది తెలంగాణ తన తలరాత తానే రాసుకునే సమయమని తెలిపారు. తెలంగాణ బతుకులు వలస బతుకులు, బొంబాయి బతుకులైనయని ఈ కరెంటు బాధేంది ఈ నీళ్ల బాధేంది వలసల బాధేందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటి పరిష్కారానికి టీఆర్‌ఎస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోలోని అన్ని అంశాలను దగ్గరుండి అమలు చేయిస్తానని హావిూనిచ్చారు. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. లాఠీలు, తూటాల ఫలితంగా తెలంగాణ వచ్చిందన్నారు. ఆషామాషీగా కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదన్నారు. ఏనాడు లాఠీల దెబ్బలు తినని, పోరాటం చేయనివారు ఇవాళ తామే తెలంగాణ తెచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 1948-56 మధ్య కొందరు పెద్దలు చేసిన తప్పులకు 60 ఏళ్లు గోస పడ్డాం. ఇక ఇప్పుడు గోసపడవద్దని చెప్పారు. ఎవరి చేతిలో తెలంగాణ ఉంటే సేఫ్‌గా ఉంటుందో ప్రజలు ఆలోచించాలన్నారు. సమైక్య రాష్ట్రంలో నీళ్లకు, కరెంట్‌కు, ఉద్యోగాలకు బాధపడ్డాం. నీళ్లు, నిధులు, అప్పుల పంపకాలు జరగలేదు. రేపు ప్రభుత్వం ఏర్పడ్డ తరవాతనే పంపకాలు చేసుకోవాల్సి ఉందన్నారు. ఏపీ నుంచి బయటపడటానికి 60 ఏళ్ల సమయం పట్టిందన్నారు. అయినా అనుకున్న తెలంగాణ రాలేదు. మళ్లీ ఏమైనా కింద పడితే 50 ఏళ్లు బాధపడుతామని చెప్పారు. అందుకే ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలను చూడంది కాదన్నారు. వీరి మోసాలకు గురి కావద్దని హెచ్చరించారు. బిజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిండని కేసీఆర్ దుయ్యబట్టారు. ఓ పక్కన చంద్రబాబును మరోపక్కన పవన్‌కల్యాణ్‌ను పెట్టుకొని తెలంగాణలో మోడీ పర్యటించారన్నారు. మోడీ నీ బతుకు ఇక కన్నీళ్లేనని తెలిపారు. ఇలాంటి సీమాంధ్ర నక్కజిత్తులు ఇక సాగగవన్నారు. తెలంగాణెళితరులు తెలంగాణపై పెత్తనం చేయాలని చూస్తున్నారని అన్నారు. వారిని ప్రజలు తిరస్కరించాలన్నారు. బాబు రాసిచ్చిన స్క్రిప్టు చదివిన మోడీ తన ఔచిత్యాన్ని మరచారన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వితంతువులు, వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500ల పింఛను ఇవ్వనున్నట్లు చెప్పారు. నిరు పేదలందరికీ పక్కాగృహాలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. మహిళలకు రూ.10లక్షల వరకు వడ్డీలేని రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించారు.