గాలిలోకి కాల్పులు

హైదరాబాద్ (జ‌నంసాక్షి): సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు, పార్టీల కార్యకర్తలు పలు చోట్ల బాహాబాహీకి దిగుతున్నట్లు రాజధాని కేంద్రానికి సమాచారం అందింది. రెండు పార్టీల అభ్యర్థులు పరస్పరం ఆరోపణలకు దిగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ సొంత జిల్లా కడప పరిధిలోని జమ్మల మడుగు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.జమ్ముల మడుగు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకం సృష్టిస్తోందని ఆరోపించారు. తమ పార్టీ ఏజెంట్లను కిడ్నాప్ చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండి పడ్డారు.రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని డైట్ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద తనకు ఓటేయాలని అభ్యర్థించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు.గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం రామిరెడ్డి పాలెంలో తెదేపా పోలింగ్ ఏజెంట్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా భావిస్తున్న వారు కిడ్నాప్ చేశారు. దీంతో పోలింగ్ బూత్ దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల వైఖరికి నిరసనగా, తెదేపా, బిజెపి శ్రేణులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.గుంటూరు జిల్లా కొల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు గాయ పడ్డారు. ప్రకాశం జిల్లా స్వర్ణలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీలకు పని చెప్పారు.మరోవైపు విశాఖ పట్నం జిల్లా సబ్బవరంలో మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ కవరేజీకు వచ్చిన మీడియా ప్రతినిధులపై దాడి చేయడమే కాక అరెస్ట్ చేస్తామని పోలీసులు బెదిరింపులకు దిగారు. ఎన్నికల సంఘం అధికారులు ఇచ్చిన పాసులు చెల్లబోవని, అనుమతి నిరాకరించడంతో మీడియా సిబ్బంది నిరసన చేపట్టారు.ఇక మాజీ ముఖ్యమంత్రులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుల సొంత జిల్లా చిత్తూరు పరిధిలో రామచంద్రాపురం మండలం నడవలూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోలింగ్ ఏజెంట్‌ను కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పోలింగ్ ఆగిపోయింది. రామచంద్రాపురం నడవలూరు పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేయి చేసుకున్నారు.ఫ్యాక్షన్ రాజకీయాలకు నిలయమైన అనంతపురం జిల్లా ముదిగుబ్బలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి మరీ తెలుగుదేశం పార్టీ ఏజంట్లను బెదిరించారని రాష్ట్ర రాజధానికి సమాచారం అందింది.ఇదిలా ఉంటే కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ బెదిరింపులకు దిగారు. ఉంగుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజంట్లను బెదిరించారని సమాచారం. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి – మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్మోహన్ నాయుడు పోలింగ్ కేంద్రం వద్ద చేతులు తిప్పుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు పరోక్ష సంకేతాలిచ్చారు.