వైఎస్ఆర్ కాంగ్రెస్, తెదేపా శ్రేణుల మధ్య ఘర్షణలు

హైదరాబాద్: సీమాంధ్ర పరిధిలోని 13 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి జిల్లాలోనూ రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం ఘర్షణలకు దిగుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి ప్రతిష్ఠాత్మకం కావడంతో ఆ రెండు పార్టీల శ్రేణులు పట్టుదలకు పోతున్నాయి.కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, జమ్మల మడుగు, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంటూరు జిల్లా నకిరికల్లు మండలం రేచర్ల గ్రామంలో రెండు పార్టీల నేతలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి స్వల్ప లాఠీచార్జీ చేశారు. మైదుకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుధాకర్ యాదవ్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజక వర్గ కేంద్రంలో ఓటర్లు ఒక్కసారిగా దూసుకెళ్లడంతో తొక్కిసలాట జరిగింది.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పులివెందుల పరిధిలోని వేంపల్లి మండలం రోంపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్, టిడిపి కార్యకర్తలు నువ్వా? నేనా? అన్నట్లు దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడేమీ జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే – తెదేపా నేత అబ్ధుల్ ఘనిని గృహ నిర్బంధం చేశారు.ప్రకాశం జిల్లా కారంచేడు మండల కేంద్ర పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతపురం అర్బన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్నాథ్ రెడ్డి భార్య ఓటు మరొకరు వేయడంతో ఆయన పోలింగ్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పెద్ద అగ్రహారంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.