తృణమూల్‌ సర్కార్‌కు చుక్కెదురు


శారదా చిట్‌ఫంట్‌ కేసు సీబీఐకి అప్పగించిన సుప్రీం
న్యూఢిల్లీ, మే 9 (జనంసాక్షి) :పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కార్‌కు చుక్కెదురయింది. తీవ్ర సంచలనం సృష్టించిన శారద చిట్‌ఫండ్‌ కుంభకోణం శుక్రవారం కీలక మలుపు తిరిగింది. కుంభకోణంపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. నగదు మదుపు దారులలో విశ్వాసం కలిగించేందుకే
సీబీఐ విచారణకు ఆదేశించినట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలను సీబీఐకి అప్పగించి, దర్యాప్తునకు సహకరించాలని పశ్చిమబెంగాల్‌, ఒడిశా, అస్సాం రాష్ట్రాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఒడిశాలో సంచలనం సృష్టించిన పొంజి కుంభకోణంపైనా విచారణ జరిపించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సుప్రీం తాజా నిర్ణయం శరాఘతంలా పరిణమించింది. రూ.2500 కోట్ల విలువైన శారద కుంభకోణంపై సీబీఐ విచారణకు మమత బెనర్జీ ప్రభుత్వం నిరాకరించింది. మరో మూడు రోజుల్లో పశ్చిమబెంగాల్‌లో తుది విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా పరిణమించాయి. తృణమూల్‌కు చెందిన చాలా మందికి ఈ కుంభకోణంలో పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. శారదా గ్రూప్‌ అధిపతి సుదీప్తా సేన్‌కు తృణమూల్‌ ఎంపీ కుణాల్‌ ఘోష్‌తో పాటు పార్టీకి చెందిన పలువురికి సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం. సుదీప్తాసేన్‌ ఇప్పటికే జైలులో ఉన్నారు. బెంగాల్‌తో పాటు పరిసర రాష్ట్రాల్లోని మదుపుదారుల నుంచి శారద గ్రూప్‌ ఏజెంట్ల ద్వారా లక్షల సొమ్మును సేకరించింది. ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా బోర్డు తిప్పేయడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో కంపెనీ ఉన్నతాధికారులతో పాటు పలువురు రాజకీయ నేతలను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. అయితే, శారద స్కాంపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్న విపక్షాల డిమాండ్‌ను మమత సర్కార్‌ తోసిపుచ్చింది. ఎన్ని ఆందోళనలు జరిగినా సర్కారు పెడచెవిన పెట్టింది. ఈ నేపథ్యంలో కోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడంతో మమతకు ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు తీర్పును విపక్షాలు స్వాగతించాయి. తాజా ఉదంతంతో మమత ప్రభుత్వం పరువు దిగజారిందని సీపీఎం, కాంగ్రెస్‌ పేర్కొన్నాయి. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడంపై ఎలాంటి ఆందోళన చెందడం లేదని తృణమూల్‌ పేర్కొంది. ‘సీబీఐ విచారణకు ఆదేశించడం మంచిదే. అయితే, గతంలో దర్యాప్తు చేసిన రిజ్వానుర్‌ రెహమాన్‌ హత్య కేసు, ఝార్గామ్‌లో నైతాయి హత్య కేసు వంటి వాటిలో చార్జిషీట్‌ దాఖలు చేయడంలో విఫలమైంది. ఈ కుంభకోణం సమస్య ఏవిధంగా పరిష్కారమవుతుందో చూద్దాం’ అని టీఎంసీ నేత కమల్‌ బెనర్జీ పేర్కొన్నారు.