ప్రొఫెసర్‌ సాయిబాబాను విడుదల చేయాలి


ఢిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్‌లో నిరసన
న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) :
ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ గోకరకొండ సాయిబాబాను విడుదల చేయాలని కోరుతూ శనివారం ఢిల్లీ యూనివర్సి టీలో విద్యార్థులు, హైదరాబాద్‌లో ప్రజాసంఘాల నాయ కులు నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణం సమీపంలోని
నల్లమిల్లి గ్రామానికి చెందిన సాయిబాబా వికలాంగుడు. ఆయన ఢిల్లీ వర్సిటీలో ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. సాయిబాబా మావోయిస్టు పార్టీకి కొరియర్‌గా పనిచేస్తూ రిక్రూట్‌మెంట్‌కు సహకరిస్తున్నాడని, మావోయిస్టుల కోసం ఓ సంస్థను కూడా నిర్వహిస్తున్నాడని మహారాష్ట్ర డీఐజీ రవీంద్ర కదమ్‌ వెల్లడించిన సంగతి తెలిసింది. గడిచిన ఆరు నెలల్లో సాయిబాబాను నాలుగుసార్లు విచారించిన మహారాష్ట్ర పోలీసులు శనివారం ఇంట్లోకి చొరబడి ఎత్తుకెళ్లారని ఆయన భార్య వసంత ఆరోపించారు. ఆయన ఆరోగ్యం సరిగా లేదని చెప్తున్నా వినకుండా దౌర్జన్యంగా సాయిబాబాను తీసుకెళ్లారని ఆమె తెలిపారు. అబూజ్‌మడ్‌ అడవుల్లోని మావోయిస్టులకు ఆయన కొరియర్‌గా పనిచేస్తున్నాడని, ఆయన కంప్యూటర్‌ నుంచి మావోయిస్టు పార్టీకి సంబంధించిన సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సాయిబాబాను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. తనపై ఏవైనా, కేసులు వారెంట్లు ఉంటే తానే స్వయంగా కోర్టుకు హాజరవుతానని గతంలోనే సాయిబాబా చెప్పినా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబాకు ఏదైనా జరిగితే కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించారు. నోరు లేని ఆదివాసీల పక్షాన వారి హక్కుల కోసం ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధం ఉందని ఆరోపించి అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు.