‘స్థానిక’ ఆలస్యానికి సర్కారే కారణం


యంత్రాంగం పనితీరు బేష్‌

సమర్థవంతంగా నిర్వహించాం : రమాకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 14 (జనంసాక్షి) :

పురపాలక, స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యానికి సర్కారే కారణమని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడంలో ఎన్నికల సంఘం వైఫల్యం ఏ మాత్రం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంతరెడ్డి తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయిందని చెప్పారు. తెలంగాణ, సీమాంధ్రలో కలిపి మొత్తం 1096 జడ్పీటీసీ, 16,589 ఎంపీటీసీలు ఎన్నికలు నిర్వహించామని.. ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 5 గంటలకు పూర్తయిందన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్వల్ప వ్యవధిలో మునిసిపల్‌, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందని.. ఇబ్బందులు ఉన్నా45 రోజుల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పారు. కోర్టుల ఆదేశాలు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 35-40 రోజుల పాటు ఈవీఎంలు, బ్యాలెట్‌ బాక్సులు భద్రపరిచామన్నారు.

గత ప్రభుత్వ వైఫల్యమే..

ఎన్నికల్లో రిజర్వేషన్లపై గత ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వల్లే ఎన్నికలు నిర్వహించడం ఆలస్యమైందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రిజర్వేషన్లను ఇవ్వకుండా తాత్సారం చేసిందని విమర్శించారు. అదే ముందుగా రిజర్వేషన్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం మేరకే ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందన్నారు. సకాలంలో రిజర్వేషన్లు ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు. చట్ట ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాల్సింది ప్రభుత్వమేనని.. కానీ, బాధ్యత నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. చివరకు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు.. అది కూడా ప్రభుత్వం పోయిన తర్వాత, రాష్ట్రపతి పాలనలో తమకు రిజర్వేషన్లు అందాయని వివరించారు. రిజర్వేషన్లు వచ్చిన వెంటనే ఎన్నికల ప్రక్రియ చేపట్టామని చెప్పారు.ఈ నెల 18న రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు రమాకాంతరెడ్డి తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ జడ్పీటీసీ పరిధిలోని ఏలూరు 1, 2లలో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు వివరించారు. అలాగే, నిజామాబాద్‌ జిల్లాలోని బండపల్లి, మైలారం ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. నెల్లూరు జిల్లా కొండాపూర్‌ మండలంలోని తూర్పు ఎర్రబల్లి, మన్నంవారిపల్లి, పొట్టిపల్లిలోని మూడు బ్యాలెట్‌ పెట్టెలకు చెదలు పట్టడంతో 1563 బ్యాలెట్‌ పేపర్లు చెడిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు వివరించారు. బ్యాలెట్‌ పత్రాలు తడిసిన చోట ఆరబెట్టి, వాటిని అభ్యర్థులకు చూపించి, వారు అంగీకరించిన తర్వాతే ఓట్ల లెక్కింపు నిర్వహించామని చెప్పారు.ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే నగర, పురపాలక సంస్థల అద్యక్షుల ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని రమాకాంతరెడ్డి చెప్పారు. సాధారణ ఫలితాల వెల్లడి అనంతరం మునిసిపల్‌ చైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా నమోదు నంతరం కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. స్థానిక సంస్థల్లో విప్‌ జారీ చేసే అవకాశం ఉండదని చెప్పారు.