ఒడిస్సా సీఎంగా నవీన్‌ ప్రమాణం


భువనేశ్వర్‌, మే 21 (జనంసాక్షి):
ఒడిశా ముఖ్యమంత్రిగా బిజూ జనతాదళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా ఆయన నాలుగోసారి సీఎం పదవిని అధిష్టించారు. రాజ్‌ భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నవీన్‌తో పా టు మరో 21 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఒడిశా గవర్నర్‌ జమీర్‌ వారితో ప్రమాణం చేయించారు. పట్నాయక్‌, ఆయన మంత్రివర్గ సహచరుల ప్రమాణ
స్వీకానికి పెద్ద సంఖ్యలో అధికారులు, పార్టీ నేతలు హాజరయ్యారు. కేబినెట్‌ మంత్రులుగా దామోదర్‌ రూట్‌, ప్రదీప్‌కుమార్‌ అమత్‌, దేబీప్రసాద్‌ మిశ్రా, బద్రీనారాయణ పాత్ర, ఉషాదేవి, విజయశ్రీ రూట్రే, విక్రమ్‌ కేశరి అరుఖ, ప్రదీప్‌ మహారథి, లాల్‌బీహరీ హిమిరికా, పుష్పేంద్రసింగ్‌ డియో, యోగెంద్ర బెహెరాలు నియమితులయ్యారు. వీరితో పాటు పలువురు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరికి ఏయే శాఖలు కేటాయించాలనే దానిపై నిర్ణయం కాగానే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారు.నవీన్‌ పట్నాయక్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. 2000 మార్చి 5న ఆయన తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని దించేసిన ప్రజలు తొలతిసారి బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం కల్పించారు. 2004 రెండోసారి అధికారం చేపట్టిన పట్నాయక్‌ 2009 వరకు కొనసాగారు. బీజేపీతో పొత్తు ఉపసంహరించుకున్న బీజేడీ సీపీఐ, సీపీఎం, ఎన్సీలతో కలిసి అధికారాన్ని చేపట్టింది. 2009లో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి అధిష్టించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిశా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేడీ మరోమారు స్పష్టమైన ఆధిక్యం సాధించింది. 147 సీట్లు ఉన్న అసెంబ్లీలో 117 స్తానాలు గెలుపొంది అధికారం కైవసం చేసుకుంది.