న్యూఢిల్లీ : 14వ భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నరేంద్ర మోడీ సరిహద్దు సైనిక శిబిరాలను సందర్శిస్తారని సమాచారం. ఆ క్రమంలో సరిహద్దు భద్రతా దళాలు, పారా మిలటరీ బలగాల్లో ఆయన ఆత్మ స్థైర్యాన్ని ఉద్దీపనం గావిస్తారు. అధికారంలోకి రాగానే అభివృద్ధి, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో పార్టీ రెండంచెల వ్యూహానికి అనుగుణంగా సరిహద్దు ప్రాంతాల్లో ఆయన పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.మోడీ హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో చేపట్టిన ఎన్నికల ప్రచార సభల్లో కూడా పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. యుపిఎ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. దేశాన్ని కాపాడుతున్న సైనికుల రక్షణకు పిలుపునిచ్చారు. “ఆయన మొదటగా సియాచిన్ సైనిక శిబిరాలను సందర్శిస్తారు. అనంతరం భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దు సైనిక శిబిరం లేదా చెక్ పాయింట్ అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే 24 పరగణాల్లో పెట్రాపోల్ చెక్ పాయింట్‌ను సందర్శిస్తారు. వాఘా సందర్శనకు కూడా ప్రణాళిక రూపకల్పన జరుగుతోంది. ఈ అన్ని పర్యటనలు కూడా దాదాపుగా వచ్చే రెండు వారాల్లో ప్రారంభమవుతాయి” అని అధికార వర్గాలు వివరించాయి. ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి సౌత్ బ్లాక్ కార్యాలయంలోని మిలటరీ ఆపరేషన్స్ రూమ్‌లో స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్(ఎస్ఎఫ్‌సి) మంగళవారం మోడీకి సైనిక వ్యూహాలను వివరించినట్లు సమాచారం. ఆ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ నేతృత్వంలోని అధికారులు దేశపు అణ్వస్త్రాలను గురించి కాబోయే ప్రధాన మంత్రికి వివరించారు. అనంతరం ఇంటెలిజెన్స్ బ్యూరో డైరక్టర్, రా(ఆర్ఎడబ్ల్యూ) అధినేత దేశ అంతర్గత, బాహ్య భద్రత గురించి నరేంద్ర మోడీకి వివరించారు.