కాంస్యమే బంగారం

చరిత్ర సృష్టిస్తూ ఉబెర్‌కప్‌లో తొలిసారి సెమీస్‌కు వెళ్లిన భారత మహిళలు.. మరో అడుగు ముందుకు వెళ్లలేకపోయారు. సైనా, సింధు సింగిల్స్‌లో అదరగొట్టి ఆధిక్యం చేకూర్చినా.. డబుల్స్ స్పెషలిస్ట్ జ్వాల, అశ్విని జోడీతో పాటు పీసీ తులసి చేతులెత్తేయడంతో ఉత్కంఠ పోరులో జపాన్ చేతిలో భారత్ పోరాడి ఓడింది. క్వార్టర్స్ లక్ష్యంతో బరిలోకి దిగి.. సెమీస్‌లో ఓడినా పతకంతో వెనుదిరిగిన భారత మహిళలు అందరి మన్ననలూ అందుకున్నారు.

న్యూఢిలీ: ప్రతిష్ఠాత్మక ఉబెర్‌కప్ బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణంపై ఆశలు రేకెత్తించిన భారత మహిళలు చివరికి కాంస్యంతో సరిపెట్టుకున్నారు. ఈ మెగా టోర్నీలో తొలిసారి సెమీఫైనల్ చేరిన సైనా నెహ్వాల్ సారథ్యంలోని భారత్ ఫైనల్ చేరడంలో విఫలమైంది. శుక్రవారమిక్కడ జరిగిన సెమీస్‌లో భారత్ 2-3తో జపాన్ చేతిలో పోరాడి ఓడింది. సింగిల్స్‌లో సైనా, సింధు విజయం సాధించి 2-0తో ఆధిక్యం కట్టబెట్టినా కీలక మ్యాచ్‌లో జ్వాల-అశ్విని జంటతో పాటు మూడో సింగిల్స్‌లో పీసీ తులసి చేతులెత్తేసింది. అప్పటికే సింగిల్ ్సలో చెమటోడ్చిన సైనా, సింధు డబుల్స్‌లో విఫలమయ్యారు. దీంతో భారత్‌కు కాంస్యమే దక్కింది.

సైనా జోరు.. సింధు హోరు: మొదటి సింగిల్స్‌లో ఏస్ షట్లర్, కెప్టెన్ సైనా 21-12, 21-13తో మినాత్సు మితానిని చిత్తు చేసి శుభారంభం చేసింది. 41 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన సైనా ప్రపంచ పన్నెండో ర్యాంకర్ మితానిపై అలవోక విజయం సాధించింది. మరో సింగిల్స్‌లో సింధు 19-21, 21-18, 26-24తో తకాహషిపై చెమటోడ్చి నెగ్గిం ది. ఈ మ్యాచ్ గంటా 12 నిమిషాల హోరాహోరీగా సాగింది. తొలిగేమ్‌లో పోరాడి ఓడిన సింధు తర్వాత పుంజుకొని రెండో గేమ్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక నిర్ణాయక మూడోగేమ్‌లో పోరు పతక స్థాయికి చేరుకుంది. గేమ్ చివర్లో చెరో పాయిం ట్ సాధిస్తూ స్టేడియంలో ఉత్కంఠ రేపారు. నాలుగు మ్యాచ్ పాయింట్లను చేజార్చుకున్న సింధు చివరికి మ్యాచ్ నెగ్గింది. దీంతో భారత్‌కు 2-0తో ఆధిక్యం లభించింది.

జ్వాల-అశ్వినీ ఫ్లాప్ షో: జ్వాల-అశ్విని జంట ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైంది. ఈ జోడీ 12-21, 22-20, 16-21తో మత్సుతోమో- తకాహషి జంట చేతిలో పరాజయం పాలైంది. తొలిగేమ్‌లో పూర్తిగా చేతులెత్తేసిన జ్వాల జంట తర్వాత పుంజుకొని రెండోగేమ్‌ను నెగ్గింది. అయితే అనవసర తప్పిదాలతో మూడోగేమ్‌తో పాటు మ్యాచ్‌నూ కోల్పోయింది. ఇక మూడో సింగిల్స్‌లో పీసీ తులసి 14-21, 15-21తో ఎరికో హిరోస్ పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో జపాన్ 2-2తో స్కోరు సమం చేసింది.

జంటగా ఓడారు: సింగిల్స్‌లో సత్తా చాటిన సైనా, సింధు తమ విభాగం కాని డబుల్స్‌లో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫైనల్ బెర్త్‌ను నిర్ణయించే మ్యాచ్‌లో సైనా-సింధు జంట 14-21, 11-21తో మియూకి మయిదా-రైకా కకివా జోడీ చేతిలో పరాజయంపాలైంది. మరో సెమీస్‌లో చైనా 3-0తో కొరియాను చిత్తు చేసి జపాన్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది.