ఐపీఎస్సే లక్ష్యం

vijetha
ప్రవీణ్‌కుమారే ఆదర్శం : పూర్ణ
నిజామాబాద్‌, జూన్‌ 15 (జనంసాక్షి) :
ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ (ఐపీఎస్‌)కు ఎంపిక కావడమే తన లక్ష్యమని అత్యంత చిన్న వయస్సులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రికార్డు సొం తం చేసుకున్న మలావత్‌ పూర్ణ తెలిపారు. ఇటీవల ఎవరెస్టు శిఖరాన్ని మరో విద్యార్థి సాధనపల్లి ఆనంద్‌కుమార్‌తో కలిసి అధిరోహించిన పూర్ణ ఆదివారం తన స్వగ్రామం నిజామాబాద్‌ జిల్లాలోని పాకాలకు చేరుకున్నారు. ఈ సం దర్భంగా జిల్లా అధికారులు, గ్రామస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. తమ గ్రామానికి చెందిన గిరిజన బాలిక అసాధారణమైన రికార్డు సొంతం చేసుకొని తిరిగిరావడం పట్ల పాకాల వాసులు గర్వంతో ఉప్పొంగారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో పూర్ణ మాట్లాడుతూ భవిష్యత్‌లో గ్రా మం, తనకు విద్య నేర్పిన గురువులు, సాంఘిక సంక్షేమ గురుకుల విదా ్యలయాలు తలెత్తుకునేలా ఐపీఎస్‌ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రవీణ్‌ కుమార్‌ సారే తనకు స్ఫూర్తి అని చెప్పారు. తన
విజయం తన గ్రామానికి తల్లిదండ్రులకు, గురువులకు అంకితమిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తున్న క్రమంలో కనిపించిన మృతదేహాలను చూసి భయపడ్డానని పేర్కొన్నారు. ఎలాగైనా ఎవరెస్టును అధిరోహించాలనే ధైర్యంతోనే ముందుకు సాగినట్లు చెప్పారు. ఎవరెస్టును అధిరోహించిన రోజు తన జీవితంలో ఎప్పటికీ మరుపురానిదని ఆమె పేర్కొన్నారు. ఆడపిల్లలు ఏదైనా సాధించగలరని తాను నిరూపించానని ఆమె వ్యాఖ్యానించారు. ఆడపిల్లలు తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని తాను నిరూపించానని, గిరిజనులు తమ బిడ్డలను అమ్ముకోవద్దని ఆమె అభ్యర్థించారు.