మరో మూడు మృతదేహాలు లభ్యం

nadi

ఒక్కొక్కటిగా బయటకెళ్లే అవకాశం?

సిమ్లా, జూన్‌ 19 (జనంసాక్షి) :

బియాస్‌ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతోంది. గురు వారం మరో మూడు మృతదేహాలను వెలి కితీశారు. దీంతో ఇప్పటివరకూ 12 మం ది విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యా యి. మరో 12 మంది విద్యార్థుల ఆచూకీ లభించాల్సి ఉంది. వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. రెండ్రోజులుగా సహాయక చర్యలు మంద గించినప్పటికీ.. మూడు మృతదేహాలను వెలికితీయగలిగారు. గురువారం ఉద యం పండో డ్యాం వద్ద ఓ మృతదేహం లభిం చింది. ఎం. శివప్రకాశ్‌ వర్మగా గుర్తించారు. మృత దేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహిం చారు. మరోవైపు మధ్యాహ్నం సమయంలో మరో రెండు మృతదేహాలు

లభ్యమయ్యాయి. విద్యార్థి ఆశిష్‌, మాచర్ల అఖిల్‌గా గుర్తించారు.

పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం మూడు మృతదేహాలను హైదరాబాద్‌ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రోడ్డు మార్గంలో ఢిల్లీ వరకు తీసుకొచ్చి, అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌ తరలించనున్నట్లు రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇంకా ఆచూకీ లభించని 12 మంది విద్యార్థుల కోసం గాలింపు చేపడుతున్నట్లు చెప్పారు. చివరి మృతదేహాన్ని వెలికితీసే వరకూ గాలింపు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అవకాశం ఉన్నంత వరకూ తమ ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు.

మిగతావి లభించే అవకాశం..

ఒక్కో మృతదేహం లభిస్తుండడంతో మిగతా వారి ఆచూకీ కూడా లభించే అవకాశం కనిపిస్తోంది. గత పన్నెండు రోజులుగా ముమ్మరంగా గాలించినప్పటికీ మృతదేహాల జాడ లభించలేదు. మానవ రహిత విమానాలు, స్కానర్లు ఉపయోగించినా ఫలితం లేకుండా పోయింది. అయితే, పరిస్థితులు సహకరించడంతో పాటు మృతదేహాలు కుళ్లి నీటిపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మిగతా విద్యార్థుల మృతదేహాలు కూడా లభించే అవకాశం ఉందని రెస్క్యూ అధికారులు చెబుతున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో మిగతా 12 మంది విద్యార్థుల మృతదేహాలను వెలికితీస్తామని పేర్కొన్నారు. ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా మృతదేహాలు లభించక పోవడంతో తల్లిదండ్రులు నిరాశగా వెనుదిరిగారు. తమ వారి చివరి చూపునకు నోచుకోలేక పోయామని కన్నీరుమున్నీరయ్యారు. అయితే, పరిస్థితి మారుతుండడం, ఒక్కొక్క మృతదేహం లభిస్తుండడంతో కన్నవారిలో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.

తరుణ్‌కు అశ్రు నివాళి

బియాస్‌ నదిలో గల్లంతై మృతి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి తరుణ్‌కు అశ్రునయనాలతో అంతిమ సంస్కారం నిర్వహించారు. ఈ నెల 8న బియాస్‌ నదిలో గల్లంతైన తరుణ్‌ సహా 24 మంది విద్యార్థులు గల్లంతైన సంగతి తెలిసిందే. తరుణ్‌ మృతదేహం బుధవారం పండో డ్యాం వద్ద వెలికితీశారు. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి మృతుడి బంధువులు, ప్రభుత్వ అధికారులు ఎస్కార్ట్‌ వాహనంలో హైదరాబాద్‌ చందానగర్‌కు తీసుకొచ్చారు. తొలుత స్వస్థలమైన తెనాలిలో అంత్యక్రియలు నిర్వహించాలని తల్లిదండ్రులు భావించారు. అయితే, మృతదేహం అప్పటికే కుళ్లిపోయి ఉండడంతో తమ ప్రయత్నాలు విరమించుకున్నారు. చివరకు చందానగర్‌లోనే దహన సంస్కారాలు నిర్వహించారు. తరుణ అంతిమ యాత్రకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు హాజరయ్యారు.

ఆశిస్‌ ఇంట విషాదం

హిమాచల్‌ ప్రదేశ్‌ బియాస్‌ నదిలో గల్లంతు అయిన విద్యార్థుల్లో మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమైయ్యాయి. మృతులు అశీష్‌ ముంతా, మాచర్ల అఖిల్‌గా గుర్తించారు. సికింద్రాబాద్‌ చిలకలగూడ శ్రీనివాసనగర్‌కు చెందిన అశీష్‌ ముంతా ప్రమాద సమయంలో ఇద్దరు విద్యార్థినులను ఒడ్డుకు చేర్చి, తాను నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడని అతని స్నేహితులు చెప్పారు. ఏడాది కిందట భర్తను కోల్పోయి విచారంలో ఉన్న ఆశీష్‌ తల్లి సత్యవాణి ఈ వార్త విని కన్నీటిపర్యంతమైంది. తన కొడుకు ఎలాగో బతికి బయటకు వస్తాడని ఆశించిన ఆ తల్లి ఆశలు అడియాశలు అయ్యాయి. ఇంట్లో ఆమెను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. అటు భర్తపోయి, ఇటు కొడుకు పోయి ఆమె రోదిస్తోంది. బంధువుల, స్నేహితులు ఆమెను ఓదారుస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఏడ్చిఏడ్చి ఆమె సొమ్మసిల్లింది. మొత్తం 24 మంది విద్యార్థలకు గాను ఇప్పటివరకు లభ్యమైన విద్యార్థుల మృతదేహాల సంఖ్య 12కు చేరింది. గల్లంతైన విద్యార్థుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.