తెలంగాణ తొలి ప్రాధాన్యం వ్యవ’సాయమే’
పచ్చటి తెలంగాణే నా లక్ష్యం
గిట్టుబాటు ధర కల్పిస్తాం
ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు
మంత్రి ఈటెల రాజేందర్
హైదరాబాద్, జూన్ 27 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికే తొలి ప్రాధాన్యత ఇస్తుందని, ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రైతులకు అనుకూలంగా ప్రభుత్వాలు తీసుకునే మద్దతు ధర వారికి చేరడం లేదని, ప్రభుత్వ నిర్ణయం అమలు కావడం లేదని మంత్రి అన్నారు. రైతులకు తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు రుణమాఫీ చేయాలని నిర్ణయించాయంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవాలని అధికారులకు సూచించారు. అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో ఆయన శుక్రవారం సవిూక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఒక ధర నిర్ణయిస్తే దానికంటే ఎక్కువ రావాల్సింది పోయి నానాటికి ధర తగ్గుతోందని, ఆశించిన ఫలితాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుకు కనీస మద్దతు ధర ఎంత ఉండాలో నిర్ణయించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటే సాద్యమో అన్వేషించాలని జేసీలకు పిలుపునిచ్చారు. ప్రజలకు ఇబ్బంది లేని రీతిలో తెల్ల రేషన్ కార్డుల తొలగింపు ఉండాలని, దీనికి అనుగుణంగా సరుకుల పంపిణీ, నాణ్యత ఉండేలా చూడాలని ఈటెల సూచించారు. తమకు అనుభవం లేకపోయినా ఆలోచన ఉందని, తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత వ్యవసాయం, రైతులేనని స్పష్టం చేశారు. రైతుల ఆత్మహత్యలు మనకు అవమానకరమన్నారు. రైతులకు ఏ విధంగా మద్ధతు ధర కల్పించగలమో అధికారులు ఆలోచించాలని కోరారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. భూమి ధరకు అయ్యే వడ్డీ, మందులు, యంత్రాల వినియోగం, యాత, కోత, అన్ని ఖర్చులు సరిగ్గా చూడాలన్నారు. మద్దతు ధర ప్రకటించే కేంద్ర ప్రభుత్వానికి సరైన లెక్కలు పంపాలన్నారు. ఇప్పుడు ఇచ్చే మద్దతు ధరతో రైతులకు రోజు కూలి రూ. 50 కూడా పడటం లేదని తెలిపారు. రైతులు గౌరవప్రదంగా బతికేలా చూసే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. రైస్ మిల్లర్లకు ఏ రాష్ట్రంలో ఎక్కువ ధర లభిస్తుందో అధికారులు అన్వేషించి వారికి మార్గం చూపినైట్లెతే రైతులకు మద్దతు ధర కల్పించే ఆస్కారం ఉంటుందన్నారు. రైస్ మిల్లర్లకు బియ్యం అమ్ముకునేందుకు మార్కెట్ చూపించి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటే అక్రమాలకు తావుండదని తెలిపారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన తరుణంలో ప్రభుత్వం కళ్లుగప్పి తప్పు చేసే ఆస్కారం ఉండదన్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందన్న విశ్వాసం ప్రజల్లో కలిగించాలని ఈటెల రాజేందర్ అన్నారు. సమస్యలకు సమైక్య పాలనే కారణమని తెలంగాణ ప్రజానికమంతా అనుకున్నదన్నారు. ప్రభుత్వం కళ్లుగప్పి తప్పు చేసే ఆస్కారం లేదని స్పష్టం చేశారు. స్వరాష్ట్రం వస్తే సకల సమస్యలు పరిష్కామవుతాయని ప్రజలంతా భావించారన్నారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.