వైఫై నగరంగా హైదరాబాద్‌

7A

ఐటీకి కేరాఫ్‌ మనమే : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, జూన్‌ 27 (జనంసాక్షి) :

హైదరాబాద్‌ నగరాన్ని వైఫై నగరంగా అభివృద్ధి చేస్తామని, నగర వాసులకు ఫ్రీ ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ సదుపాయం కల్పిస్తామని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. దేశంలోనే హైదరాబాద్‌ తొలి వైఫై నగరంగా మారుతుందని ఆయన తెలిపారు. శుక్రవారం హోటల్‌ తాజ్‌కృష్ణాలో ఐటీ కంపెనీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి పెట్టుబడులకు సంశయించొద్దని ఆయన తెలిపారు. కేంద్రంతో కలిసి గ్రామ స్థాయికి ఐటీ సేవలను విస్తరింపజేస్తామని అన్నారు. ఐటీ అభివృద్ధి కోసం నిత్యం సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. హైదరాబాద్‌ను ఇంక్యుబేషన్‌ హబ్‌గా మారుస్తామని, ఫ్రీ వైఫై సిటీగా మారుస్తామని తెలిపారు. త్వరలోనే 4జీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. దేశంలో ఐటీ ఉత్పత్తుల్లో హైదరాబాద్‌ నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. గత పాలకుల వైఫల్యంతోనే కొద్ది కాలం ఐటీ పరిశ్రమ ఇబ్బందులను ఎదుర్కొందని, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు కూడా దీనిపై ప్రభావం చూపాయని తెలిపారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు.