రాజకీయ విలువల్ని పాటించండి

8
కొత్త ఎంపీలకు మోడీ ఉద్బోధ

న్యూఢిల్లీ, జూన్‌ 28 (జనంసాక్షి) :

ప్రజా జీవితంలో ఉన్నత విలువలతో జీవించాలని ప్రజాస్వామ్య విలువలు పరిక్షించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పార్టీ తరపున నూతన ఎన్నికైన ఎంపీలకు నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నిధులను మెరుగైన ప్రజా ప్రయోజనాల కోసం వెచ్చించాలని తెలిపారు. పార్లమెంట్‌ విలువలు కాపాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. మీడియాతో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎక్కడా నోరు జారొద్దని హెచ్చరించారు. తాను కూడా కొత్త ఎంపీనేనని గుర్తు చేసిన మోడీ.. కొత్త విషయాలను నేర్చుకుంటానని చెప్పారు. సీనియర్స్‌ నుంచి ఎక్కువ అంశాలను నేర్చుకున్నానని తెలిపారు. బీజేపీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలకు రెండ్రోజుల శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌లో, ప్రజా వ్యవస్థలో ఎలా నడుచుకోవాలన్న అంశాలపై ఈ కార్యక్రమంలో ఎంపీలకు వివరించారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ, ఎంపీలకు మార్గనిర్దేశనం చేశారు. పార్లమెంట్‌లో ఎలా వ్యవహరించాలో సూచించారు. నియోజకవర్గాల్లో తరచూ పర్యటించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని మోడీ సూచించారు. అధికార పార్టీ సభ్యులుగా మరింత బాధ్యతాయుతతో వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను మీడియా, ప్రత్యేకించి సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జీరో అవర్‌ ప్రాధాన్యంపై మోడీ ఎంపీలకు వివరించారు. ప్రజా సమస్యలపై పరిష్కారానికి జీరో అవర్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పార్లమెంట్‌లో మంచి ప్రశ్నలు అడగాలని, ప్రజా సమస్యలు లేవనెత్తాలని కోరారు. కచ్చితంగా సభ సమావేశాలకు హాజరు కావాలని, చర్చల్లో పాల్గొనాలన్నారు. 181 మంది కొత్త ఎంపీలు బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. పార్టీ ముఖ్య నేతలు, సీనియర్‌ పార్లమెంటేరియన్లు నూతన ఎంపీలకు దిశానిర్దేశనం చేశారు. పార్టీ జాతీయాధ్యక్షుడు, ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తదితరులు హాజరయ్యారు. పార్టీ సీనియర్‌ నేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ తదితరులు కూడా ఎంపీలకు మార్గనిర్దేశనం చేశారు. తొలిసారిగా ఎన్నికైన బీజేపీ ఎంపీలకు పార్లమెంట్‌ వ్యవహారాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు పార్లమెంట్‌ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలపై వారిగా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ప్రజా జీవితంలో ఎంపీలు ఎలా వ్యవహరించాలో, ప్రభుత్వ విధానాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలో ప్రధాని మోడీ వివరించారని తెలిపారు.