గంగాజమున తెహజీబ్‌

2A2B

అటు రంజాన్‌.. ఇటు బోనాలు

తొలి తెలంగాణ రెండు పండుగలు షురూ

హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) :

గంగాజమున తెహజీబ్‌కు ప్రతీకయిన మన హైదరాబాద్‌ నగరంలో రంజాన్‌, బోనాల సంబరాలు షురువయ్యాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా వస్తున్న ఈ పండుగలను కన్నుల పండువగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఈ రెండు పండుగలను స్టేట్‌ ఫెస్టివల్స్‌గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు సమకూర్చి ఏర్పాట్లను పూర్తి చేసింది. ఆదివారం ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో హైదరాబాద్‌ నగరం తొలి బోనం ఎత్తింది. చారిత్రక గోల్కొండ ఖిల్లాపై కొలువైన జగదాంబిక ఆలయంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించిన అనంతరం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గోల్కొండ ఖిల్లాపై ప్రారంభమైన బోనాలు తర్వాత సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళీ దేవాలయంలో ఆ మరుసటి రోజు పాతబస్తీలోని లాల్‌ దర్జాలో నిర్వహిస్తారు. లాల్‌ దర్వాజ ఆలయంలో పాటు నగరమంతటా బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసం మొదటి రోజు గోల్కొండ ఖిల్లాపై బోనాల పండుగ చేసుకోవడం నిజాం కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఆషాఢ మాసంలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పది జిల్లాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్లు, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో గోల్కొండ మార్మోగింది. బోనాల ఉత్సవాలు జులై 27తో ముగుస్తాయి.

మరోవైపు రంజాన్‌ ఉపవాసాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. ఆకాశంలో ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో రంజాన్‌ మాసం ప్రారంభమైంది. నెల రోజుల పాటు ముస్లింలు కఠిన ఉపవాసాలు ఆచరించనున్నారు. ముస్లింలకు రంజాన్‌ అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో రోజా పాటించడం ఆనవాయితీ. రంజాన్‌ సందర్భంగా ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మసీదులకు 24 గంటల పాటు విద్యుత్‌, తాగునీటి సదుపాయాలు కల్పించారు. ఈమేరకు ప్రభుత్వం పది జిల్లాలకు రూ. 5 కోట్లు విడుదల చేశారు. దీంతో గతంలో కనీవినీ ఎరుగని రీతిలో రంజాన్‌ పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రంజాన్‌ మాసం, బోనాలు ఒకేసారి రావడంతో హిందూముస్లింలు కలిసి వేడుకలను జరుపుకునేందుకు  సిద్ధమవుతున్నారు.