మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్‌!

4A4B

డెప్యూటీ చైర్మన్‌ భానుప్రసాద్‌

‘ఆట’ రద్దుచేసుకోండి

మంత్రులు అందుబాటులో ఉండండి : సీఎం కేసీఆర్‌ హుకుం

హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) :

తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, టీఎన్‌జీవోస్‌ మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ ఎన్నికకానున్నారు. ఇటీవలె కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కరీంనగర్‌ జిల్లాకు చెందిన భానుప్రసాద్‌రావుకు ఉపాధ్యక్ష పదవి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ సుముఖంగా ఉన్నారు. శాసన మండలి చైర్మన్‌ పదవికి శనివారమే నోటిఫికేషన్‌ విడుదల కాగా జులై ఒకటిన నామినేషన్లు స్వీకరిస్తారు. అయితే చైర్మన్‌ పీఠానికి కాంగ్రెస్‌ పార్టీ కూడా పోటీ చేయాలని భావిస్తోంది.  ఇందుకోసం ఆదివారం సీనియర్‌ నేత, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి నివాసంలో భేటీ అయిన మైనార్టీ, ముస్లిం వర్గానికి చెందిన నేతను చైర్మన్‌ బరిలో నిలపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా పార్టీ బీ ఫామ్‌తో గెలిచిన అందరికీ విప్‌ జారీ చేయాలని నిర్ణయించారు. విప్‌ను దిక్కరించే వారు ప్రజా ప్రాతినిథ్య చట్టం కింద తమ సభ్యత్వాలను కోల్పోతారు. ఇప్పటికే శాసన మండలిలో కాంగ్రెస్‌ పక్షనేత డి. శ్రీనివాస్‌ శనివారం శాసనసభ కార్యదర్శి రాజసదారాంకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై ఫిర్యాదు చేశారు. వారందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాము ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్సీలపై వేటు పడుతుందని కాంగ్రెస్‌ నాయకులు ధీమాగా చెప్తున్నారు. అయితే అధికార పార్టీకి వ్యతిరేకంగా శాసనసభ కార్యదర్శి నిర్ణయం తీసుకుంటారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి శాసన మండలిలో 12 మంది సభ్యులు మాత్రమే ఉండగా, టీఆర్‌ఎస్‌కు 16 మంది సభ్యులున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ చైర్మన్‌, డెప్యూటీ చైర్మన్‌ పదవులను దక్కించుకోవడం లాంఛనమే. శాసన మండలి చైర్మన్‌, జెడ్పీ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు ఆటా సమావేశాలను రద్దు చేసుకొని హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.