పురపాలికల్లో కారు పాగా
కార్పొరేషన్లు తెరాస కైవసం
మునిసిపాలిటీల్లో 22 టీఆర్‌ఎస్, 20 కాంగ్రెస్
హైదరాబాద్, జులై 3 (జనంసాక్షి) :
పురపాలికల్లో కారు పాగా వేసింది. తెలంగాణలోని మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా అన్ని చోట్లా మేయర్ పీఠాలను దక్కించుకుంది. మునిసిపాలిటీల్లో 22 చోట్ల టీఆర్‌ఎస్, 20 పురపాలికల్లో కాంగ్రెస్ పాగా వేశాయి. ఉత్తర తెలంగాణలో టీఆర్‌ఎస్ స్పష్టమైన ఆధిక్యం కనబర్చగా దక్షిణ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ హవా కనిపించింది. నగర, పురపాలక సంస్థల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. తెలంగాణలోని మూడు కార్పొరేషన్లకు మూడింటిని దక్కించుకున్న టీఆర్‌ఎస్ మెజార్టీ మునిసిపాలిటీలను కైవసం చేసుకుంది. కరీంనగర్ కార్పొరేషన్‌లో సొంతంగా అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్.. నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లలో మెజార్టీ లేకపోయినప్పటికీ ఇతరుల మద్దతుతో పాగా వేసింది. ఎంఐఎంతో పొత్తులో భాగంగా నిజామాబాద్ మేయర్‌ను దక్కించుకున్న టీఆర్‌ఎస్ డెప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎంకు అప్పగించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో అత్యధిక మునిసిపాలిటీలను టీఆర్‌ఎస్ సొంతం చేసుకోగా మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో అత్యధిక మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆదిలాబాద్‌లో మునిసిపాలిటీలన్నీ టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. భైంసాలో ఎంఎంఐతో కలిసి అధికారం పంచుకున్న టీఆర్‌ఎస్ మిగతా మునిసిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. కరీంనగర్ జిల్లాలో 7 మునిసిపాలిటీలు టీఆర్‌ఎస్ దక్కించుకోగా కాంగ్రెస్, బీజేపీ చెరో మునిసిపాలిటీని కైవసం చేసుకున్నాయి. వరంగల్ జిల్లాలో టీఆర్‌ఎస్ 3, కాంగ్రెస్ ఒక మునిసిపాలిటీని దక్కించుకున్నాయి. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ కాస్త పట్టు నిలుపుకుంది. కాంగ్రెస్ 4 మునిసిపాలిటీలను సొంతం చేసుకోగా బీజేపీ ఒకచోట అధికారం చేపట్టింది. నల్లగొండ, సూర్యపేట చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్ 4, కాంగ్రెస్ 2 మునిసిపాలిటీలను కైవసం చేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని మూడు మునిసిపాలిటీలకు గాను టీఆర్‌ఎస్ 2, కాంగ్రెస్ ఒకటి దక్కించుకున్నాయి. ఖమ్మం జిల్లాలోని నాలుగు పురపాలక సంస్థల్లో మూడుచోట్ల కాంగ్రెస్, ఒకచోట టీడీపీ అధికారాన్ని సొంతం చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో కాంగ్రెస్, టీడీపీ చెరో రెండింటిని దక్కించుకోగా, టీఆర్‌ఎస్ ఒక మునిసిపాలిటీని కైవసం చేసుకుంది. తెలంగాణలోని మొత్తం 53 మునిసిపాలిటీలకు, 3 నగర పాలక సంస్థలకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగాయి. మొత్తం 1409 వార్డులకు గాను కాంగ్రెస్ 507 వార్డుల్లో విజయం సాధించి ఆధిక్యతను చాటుకుంది. ఇతరులు 358 వార్డుల్లో గెలువగా, టీఆర్‌ఎస్ 305 వార్డులను సొంతం చేసుకుంది. టీడీపీ 156 వార్డుల్లో గెలువగా, వైఎస్సార్‌సీపీ 10 చోట్ల విజయం సాధించింది. ఇక మూడు కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు గాను కాంగ్రెస్ 43 డివిజన్లలో విజయం సాధించింది. టీఆర్‌ఎస్, ఇతరులు చేరో 39 డివిజన్లు దక్కించుకోగా, టీడీపీ ఒక డివిజన్ దక్కించుకుంది. అయితే, ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, కాంగ్రెస్ అధికారం నుంచి వైదొలగడంతో పరిస్థితులో మార్పు వచ్చింది. దీంతో తక్కువ స్థానాలను గెలుచుకున్న టీఆర్‌ఎస్.. ఇతరుల మద్దతుతో మెజార్టీ పురపాలక సంస్థలను కైవసం చేసుకుంది.
నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్ హవా..
నిజామాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్ పట్టు నిలుపుకుంది. జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు రెండు మునిసిపాలిటీలు బోధన్, ఆర్మూర్‌లను దక్కించుకుంది. కాంగ్రెస్ కేవలం ఒక మునిసిపాలిటీకే పరిమితమైంది. నిజామాబాద్ కార్పొరేషన్‌లో 50 స్థానాలు ఉండగా ఎవరికి సంపూర్ణ మెజార్టీ రాలేదు. అత్యధిక స్థానాలు సాధించిన ఎంఐఎం (15)తో కలిసి టీఆర్‌ఎస్ (10) అధికారాన్ని పంచుకుంది. మేయర్‌గా ఆకుల సుజాత ఎన్నికయ్యారు. గులాబీ పార్టీకి బీజేపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు మద్దతు పలికారు. బోధన్‌లో టీఆర్‌ఎస్ పాగా వేసింది. ఎంఐఎం మద్దతుతో ఆ పార్టీ అభ్యర్థి ఎల్లయ్య చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 35 వార్డులకు గాను టీఆర్‌ఎస్‌కు 9 మంది సభ్యులు ఉండగా.. ఎంఐఎంకు చెందిన 10 మంది సభ్యులతో కలిసి అధికారాన్ని దక్కించుకుంది. 15 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకోవడంలో విఫలమైంది. ఆర్మూర్ మునిసిపాలిటీని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి స్వాతిసింగ్ బబ్లూ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 23 వార్డులకు గాను.. ఎవరికీ పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. 11 స్థానాల్లో కాంగ్రెస్, 10 చోట్ల టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ చేరో వార్డు దక్కించుకున్నారు. టీడీపీ, బీజేపీ మద్దతుతో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటుతో అధికార పీఠాన్ని టీఆర్‌ఎస్ దక్కించుకుంది. కామారెడ్డిలో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంది. మొత్తం 33 వార్డులకు ఎన్నికలు జరుగగా.. 17 స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ సునాయసంగా చైర్మన్ పీఠాన్ని హస్తగతం చేసుకుంది. చైర్‌పర్సన్‌గా సుష్మా గెలుపొందారు.
కరీంనగర్‌లో కారు జోరు..
కరీంనగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ సత్తా చాటింది. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లను దక్కించుకుంది. అలాగే, జిల్లాలోని మొత్తం తొమ్మిది పురపాలక సంస్థలకు గాను.. ఏడింటిని కైవసం చేసుకుంది. సిరిసిల్ల, జమ్మికుంట, హుస్నాబాద్, హుజురాబాద్, మెట్‌పల్లి, కోరుట్ల, పెద్దపల్లి పురపాలికల్లో కారు జోరు కొనసాగింది. వేములవాడలో బీజేపీ, జగిత్యాలలో కాంగ్రెస్ పాగా వేశాయి. కరీంనగర్ కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లలో టీఆర్‌ఎస్ 24, కాంగ్రెస్ 13, టీడీపీ 1 స్థానాన్ని దక్కించుకోగా, 12 చోట్ల ఇతరులు గెలుపొందారు. సాధారణ మెజార్టీకి ఒక సీటు దూరంలో నిలిచిన టీఆర్‌ఎస్ స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కార్పొరేషన్ చైర్మన్‌ను పదవిని చేపట్టింది. అలాగే, రామగుండం కార్పొరేషన్‌ను ఇతరు మద్దతుతో సొంతం చేసుకుంది. రామగుండం మేయర్‌గా లక్ష్మీనారాయణ, కరీంనగర్ మేయర్‌గా రవీందర్‌సింగ్, కోరుట్ల చైర్మన్‌గా రాజేశ్వరరావు, జగిత్యాల చైర్మన్‌గా విజయలక్ష్మి, జమ్మికుంట చైర్మన్‌గా రామస్వామి ఎన్నికయ్యారు.
ఆదిలాబాద్‌లో పోటాపోటీ..
ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. భైంసా మినహా జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో పాగా వేసింది. భైంసా మునిసిపాలిటీలో టీఆర్‌ఎస్ ఎంఐఎంతో అధికారాన్ని పంచుకుంది. ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల మునిసిపాలిటీలను టీఆర్‌ఎస్ దక్కించుకుంది. మంచిర్యాల చైర్మన్‌గా బెల్లంపల్లి చైర్‌పర్సన్‌గా సునీతారాణి, కాగజ్‌నగర్ చైర్‌పర్సన్‌గా విద్యావతి, మంచిర్యాల చైర్‌పర్సన్‌గా వసుంధర, ఆదిలాబాద్ మునిసిపల్ చైర్మన్‌గా గణేశ్ ఎన్నికయ్యారు.
వరంగల్‌లో గులాబీ పాగా..
వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీ హవా కొనసాగింది. మొత్తం ఐదు పురపాలక సంస్థలకు గాను కాంగ్రెస్ మూడు స్థానాలను దక్కించుకుంది. జనగామ, మహబూబాబాద్, పరకాల మునిసిపాలిటీలను దక్కించుకుంది. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గమైన జనగామలో టీఆర్‌ఎస్ పాగా వేసింది. ఆ పార్టీ అభ్యర్థి ప్రేమలతారెడ్డి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. నర్సంపేట మునిసిపాలిటీని దక్కించుకొని కాంగ్రెస్ ఖాతా తెరిచింది. భూపాలపల్లి, పరకాల నగర పంచాయతీలను సొంతం చేసుకుంది. మహబూబాబాద్‌లో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. మహబూబాబాద్‌లో ఏ పార్టీకి పూర్తి ఆధిక్యం రాలేదు. మొత్తం 28 వార్డులకు 7 చోట్ల కాంగ్రెస్, 8 చోట్ల వామపక్షాలు, టీఆర్‌ఎస్ 7, టీడీపీ, ఇతరులు చేరో మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఆధిక్యం
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఆధిక్యత ప్రదర్శించింది. మొత్తం నాలుగు మునిసిపాలిటీలకు గాను వామపక్షాల మద్దతుతో కాంగ్రెస్ మూడు, టీడీపీ ఒక మునిసిపాలిటీని దక్కించుకున్నాయి. కొత్తగూడెం, ఇల్లెందు, మధిర మునిసిపాలిటీలను కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో కైవసం చేసుకోనుంది. సత్తుపల్లి మునిసిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. మొత్తం 20 స్థానాలకు గాను 17 సభ్యుల బలమున్న టీడీపీ ఏకగ్రీవంగా చైర్మన్ పీఠాన్ని సొంతం చేసుకుంది. కొత్తగూడెం చైర్‌పర్సన్‌గా పులిగీత, సత్తుపల్లి చైర్మన్‌గా స్వాతి (టీడీపీ) ఎన్నికయ్యారు.
నల్లగొండలో కాంగ్రెస్ హవా..
నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పట్టు నిలుపుకొంది. ఏడు మునిసిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు ఎన్నికలు జరగగా.. ఐదు మునిసిపాలిటీల్లో నాలుగింటిని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. భువనగిరిలో బీజేపీ అధికారం దక్కించుకుంది. సూర్యపేట, నల్లగొండ మునిసిపాలిటీ చైర్మన్ల ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. ఈ రెండు చోట్ల కాంగ్రెస్ మెజార్టీ వార్డు సభ్యులు ఉన్నారు. హుజూర్‌నగర్, భువనగిరి నగర పంచాయతీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దేవరకొండ చైర్మన్‌గా మంగ్త్యానాయక్, హుజూర్‌నగర్ చైర్మన్‌గా వెంకయ్య, కోదాడ చైర్‌పర్సన్‌గా అనిత, భువనగిరి చైర్‌పర్సన్‌గా లావణ్య ఎన్నికయ్యారు.
మెదక్‌లో సత్తా చాటిన టీఆర్‌ఎస్
ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్ సత్తా చాటింది. మొత్తం ఆరు మునిసిపాలిటీలకు గాను నాలుగు చోట్ల అధికారం కైవసం చేసుకుంది. సంగారెడ్డి, మెదక్, జహీరాబాద్, గజ్వేల్‌లలో టీఆర్‌ఎస్ పాగా వేసింది. సదాశివపేట చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. ఆందోల్-జోగిపేట నగరపంచాయతీ చైర్‌పర్సన్‌గా స్వాతి, మెదక్ చైర్మన్‌గా మల్లికార్జున్‌గౌడ్ ఎన్నికయ్యారు. మెదక్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యత చాటింది. 27 వార్డులకు గాను 11 మంది సభ్యుల బలమున్న టీఆర్‌ఎస్ ఇతరుల మద్దతు చైర్మన్ పీఠం దక్కించుకుంది.
రంగారెడ్డిలో టీడీపీ, కాంగ్రెస్ పోటాపోటీ
రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్, టీడీపీల మధ్య ¬రా¬రీ పోరు నెలకొంది. చేరో రెండు మునిసిపాలిటీలను దక్కించుకోగా, ఒకచోట టీఆర్‌ఎస్ ఆధిక్యం సంపాదించింది. తాండూర్ మునిసిపాలిటీని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. 31 వార్డులకు గాను టీఆర్‌ఎస్‌కు 10 మంది సభ్యుల బలం ఉంది. 11 మంది ఇతరుల మద్దతుతో అధికారం చేజిక్కించుకుంది. బడంగ్‌పేట, వికారాబాద్‌లో కాంగ్రెస్, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేటలో టీడీపీ అధికారం చేపట్టాయి.
మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ హవా..
జిల్లాలోని 8 మునిసిపాలిటీలకు గాను కాంగ్రెస్ మెజార్టీ మునిసిపాలిటీలను దక్కించుకుంది. కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల పురపాలక సంస్థలను హస్తం చేజిక్కించుకుంది. నారాయణపేట మునిసిపాలిటీని బీజేపీ సొంతం చేసుకుంది. చైర్మన్‌గా బీజేపీ అభ్యర్థి అనసూయ గెలుపొందారు. షాద్‌నగర్ మునిసిపల్ చైర్మన్‌గా లావణ్య , మహబూబ్‌నగర్ చైర్‌పర్సన్‌గా రాధ, గద్వాల చైర్‌పర్సన్‌గా పద్మావతి (కాంగ్రెస్), వనపర్తి మునిసిల్ చైర్మన్‌గా రమేశ్‌గౌడ్ (టీడీపీ) ఎన్నికయ్యారు. కల్వకుర్తి నగరపంచాయతీ చైర్మన్‌గా శ్రీశైలం, నాగర్‌కర్నూలు నగర పంచాయతీ చైర్మన్‌గా మోహన్‌గౌడ్ (కాంగ్రెస్) గెలుపొందారు.
నగరపాలక సంస్థల మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు వీరే
కార్పొరేషన్లు :
రామగుండం – కొంకటి లక్ష్మీనారాయణ (టీఆర్‌ఎస్)
కరీంనగర్ – సర్దార్ రవీందర్‌సింగ్ (టీఆర్‌ఎస్)
నిజామాబాద్- ఆకుల సుజాత (టీఆర్‌ఎస్)
మునిసిపాలిటీలు :
రంగారెడ్డి జిల్లా :
వికారాబాద్ – వి. సత్యనారాయణ (కాంగ్రెస్)
బడంగ్‌పేట్- నర్సింహాగౌడ్ (కాంగ్రెస్)
తాండూరు- విజయలక్ష్మి (టీఆర్‌ఎస్)
పెద్దఅంబర్‌పేట – ధనలక్ష్మి (టీడీపీ)
ఇబ్రహీంపట్నం- కె. భరత్‌కుమార్ (టీడీపీ)
మెదక్ జిల్లా :
మెదక్ – మల్లికార్జున్‌గౌడ్ (టీఆర్‌ఎస్)
గజ్వేల్ – భాస్కర్ (టీఆర్‌ఎస్)
ఆందోల్/జోగిపేట – కవిత (కాంగ్రెస్)
సంగారెడ్డి – బొంగుల విజయలక్ష్మి (కాంగ్రెస్)
సదాశివపేట – విజయలక్ష్మి (టీఆర్‌ఎస్)
జహీరాబాద్ – చెన్నూరు లావణ్య (టీఆర్‌ఎస్)
నిజామాబాద్ జిల్లా :
కామారెడ్డి – పిప్రి సుష్మ (కాంగ్రెస్)
బోధన్ – ఎల్లయ్య (టీఆర్‌ఎస్)
ఆర్మూర్ – స్వాతిసింగ్ (టీఆర్‌ఎస్)
వరంగల్ జిల్లా
భూపాలపల్లి – సంపూర్ణ (టీఆర్‌ఎస్)
నర్సంపేట – రామచంద్రయ్య (కాంగ్రెస్)
జనగామ- డి. ప్రేమలతారెడ్డి (టీఆర్‌ఎస్)
మహబూబాబాద్- డాక్టర్ భూక్యా ఉమ (కాంగ్రెస్)
పరకాల – రాజ భద్రయ్య (టీఆర్‌ఎస్)
కరీంనగర్ జిల్లా :
హుస్నాబాద్ – చంద్రయ్య (టీఆర్‌ఎస్)
సిరిసిల్ల – సామల పావని (టీఆర్‌ఎస్)
జమ్మికుంట – రామస్వామి (టీఆర్‌ఎస్)
జగిత్యాల – టి. విజయలక్ష్మి (కాంగ్రెస్)
హుజూరాబాద్ – విజయకుమార్ (టీఆర్‌ఎస్)
కోరుట్ల- శీలం వేణుగోపాల్ (టీఆర్‌ఎస్)
వేములవాడ – నామాల ఉమ (భాజపా)
పెద్దపల్లి – రాజయ్య (టీఆర్‌ఎస్)
మహబూబ్‌నగర్ జిల్లా :
వనపర్తి – పి. రమేశ్ గౌడ్ (టీడీపీ)
కల్వకుర్తి – శ్రీశైలం (కాంగ్రెస్)
మహబూబ్‌నగర్ – రాధా అమర్ (కాంగ్రెస్)
గద్వాల – పద్మావతి (కాంగ్రెస్)
అయిజ – రాజేశ్వరి (టీఆర్‌ఎస్)
నల్గొండ జిల్లా :
భువనగిరి – లావణ్య (బీజేపీ)
హుజూర్‌నగర్ – వెంకయ్య (కాంగ్రెస్)
మిర్యాలగూడ – నాగలక్ష్మి (కాంగ్రెస్)
కోదాడ – ఒంటిపులి అనిత (కాంగ్రెస్)
దేవరకొండ – మంగ్యానాయక్ (కాంగ్రెస్)
నల్గొండ, సూర్యాపేట – శుక్రవారానికి వాయిదా
ఆదిలాబాద్ జిల్లా :
కాగజ్‌నగర్ – సీపీ విద్యావతి (టీఆర్‌ఎస్)
భైంసా- సబియా బేగం (ఎంఐఎం)
ఆదిలాబాద్ – మనీష (టీఆర్‌ఎస్)
నిర్మల్ – గణేష్ (టీఆర్‌ఎస్)
మంచిర్యాల – వసుంధర (టీఆర్‌ఎస్)
బెల్లంపల్లి – సునీతరాణి (టీఆర్‌ఎస్)
ఖమ్మం జిల్లా
సత్తుపల్లి – స్వాతి (టీడీపీ)
ఇల్లెందు – మడత రమ (కాంగ్రెస్)
కొత్తగూడెం – పులి గీత (కాంగ్రెస్)
మధిర – నాగరాణి (కాంగ్రెస్)