ఐఏఎఫ్ మాజీ చీఫ్ త్యాగిపై మనీ ల్యాండరింగ్ కేసు
న్యూఢిల్లీ, జులై 4 (జనంసాక్షి) :
భారత వైమానికదళ మాజీ అధిపతి ఎస్‌పీ త్యాగిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. వీవీఐపీల కోసం అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కేసులో రూ.3,600 కోట్ల మేర ముడుపులు చేతులు మారిన వ్యవహారంలో త్యాగితో పాటు మరికొందరిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేశారు. విదేశీ మారక చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్లు కొనుగోలు చేసేలా లాబీయింగ్ చేసిన అధికారులు, మధ్య వర్తులకు మధ్య రూ.360 కోట్లకు పైగా ముడుపులు చేతులు మారినట్లు 2013 మార్చిలో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది. ఆ డబ్బు హవాలా పద్ధతిలో దేశాల సరిహద్దులు దాటి చేతులు మారిన నేపథ్యంలో సీబీఐ క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఏడాది క్రితం సీబీఐ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ త్యాగితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఐరోపా జాతీయులు కార్లో జెరోసా, క్రిస్టియన్ మిషెల్, గ్విడో హష్కె, ఇటలీకి చెందిన మెకానికా, బ్రిటన్‌కు చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్, చండీఘర్‌కు చెందిన ఐడీఎస్ ఇన్ఫోటెక్, ఏరో మేట్రిక్ అనే నాలుగు కంపెనీలపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఈడీ 13 మంది వ్యక్తులు, కంపెనీలను నిందితులుగా పేర్కొంది.